Thursday, January 12, 2017

దశాబ్దపు గురువు... MANI RATNAM's గురుకాంత్ దేశాయ్



మణి రత్నం ... ఈయన సినిమా వస్తోంది అంటే అందరి ఆలోచనా  ఒక్కటే..  ఏదో కొత్త విషయం నేర్చుకునే ఆవకాశం వస్తోంది అని. అదే ఆయన ఒక వ్యక్తి మీద చిత్రం తీయబోతున్నాడని టీవీలు గోల చేస్తుంటే ఆయన చిన్న చిరునవ్వుతో కాదని తల అడ్డంగా ఊపేశారు. కానీ ఆయనకు తెలియదు సిరివెన్నెలగారి  పాట  విన్న శ్రీనివాసుడిలా ఇంకొకడు ఆయన చూపే చిత్రాన్ని చూసి స్ఫూర్తి చెందుతాడని.  దీన్ని చూసిన చాలా మందికి అర్ధమయ్యే విషయం ... ఇది  రిలయన్స్ అధినేత ధీరుభాయి అంబానీ చరిత్ర ను ఆధారం చేసుకుని తీసిన చిత్రం అని. చరిత్రలు, పూర్వాపరాలు గురించి వదిలేసి మనకిష్టమయిన సినిమా లోకి దూకేద్దాం.

లైట్స్ ఆపగానే అమితాబ్ లాంటి ఇంకో గంభీరమైన గొంతుతో కథ మొదలవుతుంది . ఆ గొంతు  ఆయన అబ్బాయి అభిషేక్ బచ్చన్ ది.  "సప్నే మత్ దేఖో ..సప్నే కభీ సచ్ నహీ హోతే.. మేరే బాపూ కెహతా థా, లేకిన్ మైనే ఏక్ సప్నా దేఖా" అనే మాటలతో మోదలవుతూనే.. గుజరాత్ లోని ఇధార్ గ్రామంలోని అతని బాల్యం లోకి దూకేస్తుంది.. వ్యాపారం చేయడానికి దేశం వదిలి వెళతానని ఒక పదమూడేళ్ల పిల్లాడు .. చదువు సరిగ్గా వెలగబెట్టు అని తండ్రి తిట్టే తిట్లు ... అటు నుండి ఇస్తాన్బుల్ .. మళ్ళీ గుజరాత్ .. సుజాత అనే అమ్మాయి కన్న కలలు... అటు నుండి రైలు లో గురు సుజాతల  పరిచయం.. స్నేహితుడిని వ్యాపారం అంటూ ఒప్పించి వాళ్ళ అక్కను పెళ్లి చేసుకుంటానని వెళ్లడం.. కాబోయే మామ ఊరి వారి సంకుచితత్వాలు గురించి చెప్పడం .. అన్నిటిని కొట్టి పారేసి పెళ్లి చేసుకుని బొంబాయి కి మకాం మార్చడం... అసోసియేషన్  సభ్యత్వం గురించి 'స్వతంత్ర  సమాచార్' దినపత్రిక అధిపతి మాణిక్ దాస్ గుప్తా ను కలవడం , వ్యాపారంలో వృద్ధి, భార్యాభర్తల మధ్యన తగువు.. గురుకాంత్ గురుభాయ్ గా ఎదగడం ... మాణిక్ దాస్ గురు కు ప్రత్యర్థి గా మారి  శ్యామ్ సక్సేనా అనే వ్యక్తిని గురుభాయ్ రహస్యాలను బట్ట బయలు చేయమని ఆజ్ఞాపించడం వరకూ చకచకా కన్నార్పనివ్వకుండా, రెప్పపాటులో  జరిగిపోతాయి. విశ్రాంతి సమయానికి  అద్భుతమైన మాట తో ముగిస్తారు మణిరత్నం .... "శ్యామ్ భాయ్! గురుభాయ్ సే లడ్నా, తో గురుభాయ్ బన్కే లడ్నా"  అని ... అక్కడి నుండి పోలిస్టర్ ఫ్యాక్టరీ నుండి పెట్రో కెమికల్ ఫ్యాక్టరీను కట్టేదాకా ఆయన అనుభవించిన వ్యయప్రయాసల గురించి, దొంగ దోపిడీ అనే వార్తల నుండి షేర్ మార్కెట్ లబ్ధిదారుల దాకా, సుజాత గారు "50 పర్సెంట్ పార్ట్నర్ హై సాబ్" అని అందించే స్ఫూర్తి నుండి .. "తుమ్హారే పేట్ మే సారే పచ్చిస్ హజార్ లోగ్ హై " అని విసిరే ఛలోక్తుల దాకా అన్నీ అద్భుతంగా కుదిరాయి.

ఇక సినిమా లోని తారాగణం గురించి చెప్పుకోవాలి .. మణి రత్నం గారి సినిమాకు వన్నె తెచ్చేదే ఆయన ఎంచుకునే నటీనటులు.. ముఖ్యంగా గురుకాంత్ దేశాయ్ గా జనాల ముందుకు వచ్చిన అభిషేక్ బచ్చన్. అవ్వడానికి అమితాబ్ గారి వారసుడైనా అప్పటి దాకా అతని మీద ఒక చిత్రాన్ని పూర్తిగా వదలవచ్చు అనే నమ్మకం ఎవరికీ కలిగి ఉండకపోవచ్చు.  కానీ పతాక సన్నివేశాలలో అతని నటన చుస్తే నటన "కమల్ హాసన్" నాయగన్ ను తలపిస్తుంది.  తరువాత సుజాతగా అలరించిన ఐశ్వర్యా రాయ్, వీరిద్దరి జోడి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. తేరే బినా పాట లోని నాట్యం, బర్సో రే మేఘా లో సుజాత గారి స్వతంత్ర భావాలు చూడదగ్గవి. వీళ్ళ మధ్యలో ఇంకొక జంట శ్యామ్ పాత్ర వేసిన మాధవన్, తన భార్యగా విద్యా బాలన్. మాణిక్ దాస్ గా మిథున్ నుండి ఐఏఎస్ అధికారి గా నటించిన ప్రతాప్ పోతన్ వరకు అందరూ పాత్రలకు గౌరవం హుందాతనం తీసుకువచ్చారు. 

ఇంక టెక్నికల్ విషయాలకు వస్తే గుల్జార్ కాలానికి రెహ్మాన్ సంగీతం.  రెహ్మాన్ గారి బాణీలు  అప్పటికీ ఇప్పటికి కూడా శ్రావ్యంగా ఉంటాయి, దానికి ఉదాహరణ సుజాత పాడే బరసో రే మేఘా అనే పాట. ఈ పాట పుట్టక మునుపు అందరి నోటివెంబట మేరే ఖాబో అని పాడే అమ్మాయిలు, ఇక్కడ నుండి ఈ పాటను  వదలలేదు. సమీర్ చందా గారి కళకు రాజీవ్ మీనన్ గారి కెమెరా పనితనం కళ్ళకు పండుగలాగా ఉంది .నవీ ముంబాయి నుండి తమిళ నాడు, ఆంధ్రలో తీసిన దృశ్యాల వరకు మల్లికా షెరావత్ నర్తించిన పాట నుండి ఏక్ లో ఏక్ ముప్త్ పాట వరకు ప్రతీ సెకను మనల్ని నోర్లు వెళ్ళబెట్టేలాగా చేస్తుంది. 

ఆకాశంలో చుక్కలెన్ని ఉన్నా చందమామ మాత్రం దర్శకుడు మణిరత్నం అనాలి . నిరుడు తరం కథ ఎంచుకోడమే కాదు మనల్ని ఆ కాలంలోకి టైం ట్రావెల్ చేయించే ప్రయత్నం చేశారు, ప్రతీ ఫ్రేము నుండి మనల్ని 1950లలోకి తీసుకువెళ్లారు. ముఖ్యంగా టైటిల్ కార్డులో అక్షరాలను టైపురైటర్ కొడుతున్నట్టు వెయ్యడం నుండి సినిమా ఆద్యంతం ఒక రస్టిక్ బ్రౌన్ కలర్ లో చూపించడం. ఇలాంటి ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు ఈ సినిమా నుండి. 

అలాంటి సినిమా కి ఇవాళ పదేళ్ళు నిండాయి అని చెప్పుకోడానికి గర్వపడుతున్నాను. మణిరత్నం గారు రాబోయే "కాట్రు వెళియిడై"తో మంచి విజయం సాధించి అలానే ఇంకొన్ని విషయాలను నేర్పుతారని ఆసిస్తూ .... 

1 comment: