- 2016 లో ఒక మంచి సినిమా అనగానే గుర్తుకొచ్చే చిత్రం... మనమంతా!! ఇది అందరికోసం తీసిన కథ కాకపోవచ్చు కానీ ఇది మన అందరి కథ. మన మధ్యన జరిగే ఒక మధ్య తరగతి కథ. ఇందులో నటించిన మోహన్ లాల్ అనే మలయాళ నటుడికి 6 పాక్ లేకపోవచ్చు, గౌతమి గారికి గ్లామర్ తగ్గుండచ్చు కానీ నటన పరంగా అందరూ (పిల్లల తో సహా) వారి వారి పరిమితికి మించి నటించారు. ముఖ్యంగా చెప్పుకోవలసింది తెరవెనుక పనిచేసిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఒక్కరే కాదు, ప్రతీ రచయితనూ కూడా (మాటలు, పాటలు).
- బండి పంక్చర్ అవ్వగానే మెకానిక్ తో "ట్యూబ్ వచ్ఛే నెల మార్చవచ్చు ముందు ఆ కన్నం వెతికి పూడ్చరా " ఇలాంటి మాటలు మధ్య తరగతి వారి జేబు కున్న నెలసరి పరిమితిని గుర్తు చేస్తాయి.
- "షుగరు పేషెంట్లకి షుగరు లెస్ స్వీట్స్ ఉన్నట్టు, అల్సర్ పేషెంట్లకి కారం లేని పచ్చళ్ళు అమ్మటం " అనేది ఒక మధ్య తరగతి వాడికి సంపాదన మీద ఉన్న కోరికకు అద్దం పడతాయి .
- "బ్రతకడం నేర్చుకుంటూ మనిషిలా బ్రతకడం మరిచిపోయాను", "తలకి తుపాకీ గురిపెట్టినా ఆయన పధ్ధతి తప్పలేదు , చిన్న తలనొప్పికే నేను అడ్డదార్లు వెతికాను .. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు నేను కనీసం మనిషిగా కూడా మిగలలేకపోయాను" లాంటి మాటలు మానవతా విలువలను తట్టి లేపుతాయి.
- "ఏ ఆలోచనతో జన్మించింది జగతి" లాంటి పాటలు మనసుకు హత్తుకుంటాయి... కళ్ళవెంబట వెచ్చని కన్నీటితో మన మనస్సులను ప్రక్షాళన చేస్తాయి.
- ఈ చిత్రానికి ఉన్న మరో గొప్ప సంగతి... మలయాళo కు చెందిన మోహన్ లాల్ గారు తన పాత్ర కు తానే గాత్రం చెప్పుకోవడం ... రాయలు వారు అన్నట్టు " దేశ భాష లందు తెలుగు లెస్స " అన్న నానుడి గుర్తుకువస్తుంది.
- "పర్సుయిట్ అఫ్ హ్యాపీనెస్" లాంటి చిత్రానికి ఏమాత్రం తీసిపోని క్లాసిక్ గా ఇది కూడా మిగిలిపోతుంది .
- జ్యో అచ్యుతానంద : ఈ ఏడాది వచ్చిన మరో అద్భుతమైన చిత్రాలలో ఒకటి. అన్నదమ్ముల మధ్యన ప్రేమనే కాదు, కోపతాపాలలోని కష్టాలని, కుటుంబం విడిపోతే కలిగే నష్టాలని అద్భుతంగా తెరకెక్కించారు శ్రీనివాస్ అవసరాల.
- ప్రథమంగా ఆయన రాసిన మాటలకు నిజంగానే మంత్రముగ్ధులు అవ్వకతప్పదు.
- "మేము ఇద్దరం ఓ , ఓయి , ఓసి , అని సంబోధనా ప్రధమా విభక్తిలో మాట్లాడుకుంటాం " లాంటి సంభాషణలు భాషకు పునర్వవైభావాన్ని తెచ్చిపెట్టాయి. "సంతోషం గా ఎలాగో లేరు కనీసం సుఖంగా ఉండండి " అని అమ్మ చెప్పే మాట, "తండ్రి స్థానంలోకి రావడానికి ఇచ్చిన గిఫ్ట్ " లాంటి మాటలు కళ్ళను చెమరుస్తాయి.
- "ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటున " కళ్యాణ్ గారి స్వరానికి శంకర్ మహదేవన్ గారి గాత్రం మరింత మాధుర్యాన్ని జోడించింది.
- రోహిత్, నాగ సౌర్య, రెజీనా నటన, అన్నీ కలగలిపి మామూలు చిత్రంగా కనపడుతూ ఒక చక్కని సినిమా గా రూపుదిద్దుకుని మంచి విజయాన్ని సాధించింది.
- క్షణం : స్క్రీన్ ప్లే ఆధారం గా తెరకెక్కింది ఈ చిత్రం అని ఎన్నో సార్లు విన్నా, కథనానికి పెద్ద పీట వేసిన చిత్రం క్షణం. వాణిజ్య విలువలు ఏ మాత్రం తగ్గకుండా అలాగే అనవసరమైన ఖర్చు పెట్టకుండా సూటిగా కథలోకి దూసుకెళ్లిపోతుంది "క్షణం ". అడవి శేష్, అదా శర్మ , కిషోర్ అభినయం ఒక్కటే కాదు, దర్శకత్వం వహించిన రవికాంత్ ఒక్కరే కాదు, ప్రతి ఒక్క టెక్నీషియన్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ చిత్రం.
- అ .. ఆ : గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి విజయావారి చిత్రాలను ఆదరించే ప్రతి ఒక్కరికి త్రివిక్రమ్ గారు మళ్ళీ ఇచ్చిన మరచిపోలేని చిత్రం. అ ఆ ... అవ్వడానికి మాతృక మీనా అనే నవల ఆధారంగా తెరకెక్కినా, నేటి కాలానికి తగ్గట్టుగా అన్ని మార్పులు చేసి చాలా స్టయిలిష్ గా తీశారు త్రివిక్రమ్ గారు. పాత్రలు మాట్లాడే యాస వ్యవహరించే తీరే కాదు , వారి పేర్లనుండి తెలుగుతనం ఉట్టిపడే లాగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఆయన. పల్లం వెంకన్న పాత్ర ఎంత తంపులు పెట్టే రకమైనా అతని మాటలు ఛలోక్తులు ఆద్యంతం నవ్వులు కురిపిస్తాయి. ముఖ్యంగా మనం గుర్తుతెచ్చుకునేది పల్లెటూరిని ఇంకా అందంగా చిత్రించిన కెమెరామన్ నటరాజన్ సుబ్రమణియం (నట్టి) గారి కెమెరా పనితనం. యా యా పాటలో రామజోగయ్య శాస్త్రి గారి పదానికి మిక్కీ అందించిన స్వరానికి ఏ మాత్రం తీసిపోకుండా అద్భుతంగా చిత్రించారు.
- పెళ్లిచూపులు : పెళ్లి అనే ఒక మామూలు విషయం చుట్టూ అల్లిన అల్లిబిల్లి కథ లా చక్కగా ఉంటుంది ఈ చిత్రం. ప్రశాంత్, కౌశిక్ లాంటి పాత్రలు రోజూ మనకు తారసపడుతూ ఉంటాయి . ఆఖరున "నా సావు నేను చస్తా నీకెందుకు " అద్భుతంగా పేలిన జోకు. ఆద్యంతం హాస్యాస్పదంగా సాగిపోతూ మంచి వినోదాన్ని పంచింది.
- బ్రహ్మోత్సవం: ఒక మహేష్ సినిమా... భావుకత ఎక్కువయ్యో లేదా లెక్కలు సరిగ్గా కుదరకో అనుకున్న ఫలితం రాకున్నాకూడా ఎన్నో మంచి విషయాలను నింపుకున్న చిత్రం ఇది . ముఖ్యంగా రావు రమేష్, మహేష్ ల పాత్రలు ప్రవర్తించే తీరు నటులుగా వారిని ఒక మెట్టు పైకి ఎక్కించింది. "అలసిపోయేంతవరకు కాదు అర్ధమయ్యే వరకు వెతుకు" "నలుగురు చుట్టూ ఉన్నారు నాకేంటి ?" లాంటి మాటలు మనను ఆలోచింపచేస్తాయి.
- ఇంకా ఈ సంవత్సరం లో వచ్చిన ఎన్నో అద్భుతాలు తండ్రి బాధను తీర్చి ఆయన ఆఖరి క్షణాలను ఆనందంగా మార్చిన సుకుమార్ గారి " నాన్నకు ప్రేమతో", బాపుగారి పెళ్ళిపుస్తకం ని తలపించే "కళ్యాణ వైభోగమే", రోహిత్ అందించిన "అప్పట్లో ఒకడుండేవాడు", అంతస్థులు వేరైనా మనిషి గుండె సడి ఒక్కటే, మనిషి పంచే ప్రేమ ఒక్కటే అని ఒక ఫారిన్ చిత్రం ఆధారంగా వచ్చిన నాగార్జున కార్తీ ల "ఊపిరి", మనిషి చనిపోయినా ప్రేమ కు చావులేదు అని చూపించిన నిఖిల్ "ఎక్కడికిపోతావు చిన్నవాడా?" , రామ్ అందించిన "నేను శైలజ", కొరటాల శివ "జనతా గారేజ్" , రాంచరణ్ "ధృవ" , శర్వానంద్ "ఎక్సప్రెస్ రాజా", మోహన్ కృష్ణ గారి "జెంటిల్ మాన్ " , ప్రవీణ్ సత్తారు "గుంటూరు టాకీస్" , సోగ్గాడి సరదాలు తో పాటు ఒక అందమైన పల్లెటూరి కథ తో సంక్రాంతి అల్లుడి లాగా దిగిన కళ్యాణ్ కృష్ణ "సొగ్గాడే చిన్నినాయన", మూఢనమ్మకాలు వీడి ఆత్మవిశ్వాసం తో ఏ పనైనా చేయవచ్చు అని చూపిన శ్రీనివాస్ రెడ్డి "జయమ్ము నిశ్చయమ్మురా" , మళయాళ చిత్రాన్ని ధీటుగా సవాలు చేసిన చందు మొండేటి "ప్రేమమ్" , ఆహ్లాదకరమైన ఒక స్నేహమనే ప్రయాణం నుండి మొదలై ఒక యండమూరి డిటెక్టివ్ నవల లాగా మలుపులు తిరిగే గౌతమ్ మీనన్ "సాహసం శ్వాసగా సాగిపో" లాంటి మంచి సినిమాలు అందించింది 2016.
2017 ఇంకా మంచి చిత్రాలను అందిస్తుంది అని ఆశిస్తూ నూతన సంవత్సరాన్ని స్వాగతిద్దాం.
nice blog... good analysis
ReplyDelete