Saturday, February 19, 2011

వికసించిన స్వాతిచినుకు










 
హైదరాబాద్
29 - 07 - 2010 

ఉదయం 5  గంటలకు నిద్ర లేచి బయటకు వెళ్లి వచ్చాను .. మళ్లీ కాలేజీ కి వెళ్ళాలని బయలుదేరబోయాను .. నన్ను నేను నమ్మలేని ఆశ్చర్యం , ఆనందం.. కోట్లు వచ్చినందుకు కాదూ ...కార్లు కొన్నాననీ కాదు ... అలాంటి కలలేమీ కావు...
ఆనందమంతా రోజూ ఎర్రని సూర్యుడి కాంతి తో నన్ను పలకరించి వెళ్ళే గాలి, ఇవ్వాళ  సుగంధాన్ని వెదజల్లుతోంది..
పొగ తో కూడిన ధూళి కి బదులుగా ఆకాశం నల్లని మేఘ ఛాయతో ముసురుగప్పేసింది... కాంతి సన్నగిల్లిన సూర్యుడు  వెండి కవచం తొడిగిన రుద్రుడి  లాగా కనిపించాడు..
వినిపించిన ఆ ఉరుముల శబ్దం నన్ను అడ్డేది ఎవడురా అని అన్నట్టు గా గర్జిస్తున్నాయి....   వెంటనే ముత్యాలు నేల మీదకి రాబోతున్నాయేమో అని అనిపించేంతలా సన్నటి నీటి తుంపర మొదలైంది..   

ఆ పడుతున్న తుంపర లో తడుస్తున్న పూలు తమ సిగ్గు ను దాచుకోలేక సతమతమవుతుంటే... ఇదే మంచి అదనుగా తలచిన తేనేటీగలు ఆ పూలకేసి చూస్తూ కన్నుగీటుతున్నాయి  .....
ఇంత అందమైన ప్రకృతి ని వదిలేసి మనిషి లోపల దాక్కునందుకు ప్రకృతి నొచ్చుకుంది... ఈ వాన కోసమే.. కోట్లు కర్చుపెట్టి...యాగాలు చేసి..తీరా తను వచ్చేసరికి ఆహ్వానించకపోగా ... అసహ్యించుకుని లోన దక్కున్నావా ఓ మనిషీ అని అనుకుంటూ బుంగ మూతి పెట్టినట్టు అనిపించింది!
ఇదంతా ఒక పక్క అయితే ... వాన తాకిడికి పులకించిన నేల ఈడొచ్చిన లేడి పిల్ల లాగ గంతులు వేస్తూ, ఆ చినుకులను పరవళ్ళు తొక్కిస్తోంది..... ఇదంతా గమనించిన ఆకాశం, భూమి పడే ఆనందాన్ని తనలో తనే దాచుకోవలనుకుని,తన వాళ్ళ కాక  చివరకు ఇంద్రధనుస్సు రూపం లో ఫక్కున నవ్వేసింది...
                                                                                                


ఇప్పటిదాకా తనకు పని లేక, ఏమి తోచక, గాలికి తిరుగుతున్న పాల పిట్ట, తనకు లగ్గం పెట్టే ఘడియ వచ్చిందనే ఆనందం తో రెక్కలు రెపరెపలాడిస్తోంది...
తన రంగు తో కనీసం పెళ్లి కూతురికి కాటుక అయినా దిద్దే అదృష్టం లేనందుకు కాకి తనలో తనే సణుగుతూ మూల కూలబడింది...తన అవసరం ఇప్పుడే ఉండదనుకున్న కోకిల మాఘ మాసపు పిలుపు కోసం వేచి చూస్తూ కునుకు తీస్తోంది...
ఈ పక్షులు వేసే వేషాలు చూసిన ఏనుగు ఒక్క సారి అడవంతా దద్దరిల్లేలాగా ఒక్క సారి ఘీంకరించింది...
తన మర్యాదకు లోటులేదని తెలిసిన సింహం మాత్రం కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది...
మగ పడుచు లాంచనాల కోసం నక్క కూడా సింహం పక్కన చేరింది...మేమేమైనా తక్కువ తిన్నామా అని ముక్కున వేలేసిన మిగితా జంతువులు...పెళ్లి పనులలో మునిగిపోయాయి...అయతే చూసిరమ్మంటే కాల్చి వచ్చే వాటం గల కోతి ని పెండ్లి పిలుపులకు పంపించాయి...అలా ప్రకృతి ఆధ్వర్యం లో  వానకూ పుడమికీ జరిగే ఈ లగ్గానికి  అనుకోని ఆహ్వనితున్ని అయిన నేను ఆ పెండ్లి ని చూస్తుంటే బలమైన గాయం నా తలకి తగలడం తో కళ్ళు నులుముకుని చుట్టుపక్కల పరికించి చూసాను...ఎదురుకుండా అమ్మ..అమ్మోరు లో రమ్యకృష్ణ లాగా గరిట పట్టుకుని నిలబడి నన్ను నిద్ర లేపింది...

                       







 అంత లో కూడా కొంత ఆనందం ఏమిటంటే నా కలలోనే కాదు నిజంగానే బయట వాన పడుతోందని నేను సంబర పడుతుంటే...ఎంత ఎదిగినా నీకు స్వేచ్చ లేదు రా అని వెక్కిరిస్తూ "స్వాతిచినుకు వికసించింది.."!   



                           -సమాప్తం-

2 comments:

  1. anna... simply no words!!!
    really awesome
    ప్రకృతి ని అర్ధం చేసుకున్నావ్ అన్నయ

    ReplyDelete