Wednesday, June 7, 2017

ఇతిః శివం

అది శరదృతువు. ఆ ప్రదేశమంతా ఆకుపచ్చని రంగులో మునిగి తేలుతోంది. ఇన్నాళ్ళుగా మబ్బుల మాటున దాగిన వెన్నెల, మబ్బులను వీడి కొత్త పుంతలు దిద్దుకుని నిశిరాత్రిలో వెలగనారంభించింది. ఆ ప్రాకృతిక సౌందర్యాన్ని చూసిన ఎవ్వరికైనా కలము పట్టి  కోటి ఊహలలో  తేలి ఆడాలనిపిస్తుంది.  ఇంటి డాబా మీద కూర్చున్న ధరణీపతి ఆ అందాలను ఆస్వాదిస్తూ చిరు దరహాసాన్ని పెదవుల పైన పూసుకొని తన గదిలోకి నడిచాడు. 

ధరణీపతి నగరంలోని  ఒక ప్రముఖ  మాస పత్రికకు యజమాని. ఆ పత్రిక పేరు ధరణి. సోషల్ మీడియా, విస్తృతంగా పెరిగిపోయిన టీవీ చానెళ్ల మధ్యన కూడా పత్రికను సర్క్యూలేషన్ ఏమాత్రం తగ్గకుండా  దిగ్విజయంగా నడిపిస్తున్నారు ఆయన. దానికి ఒకానొక కారణం కాలానికి తగ్గట్టు ఆయన కూడా ప్రచురించే ప్రతీ విషయంలో నిశితమైన శ్రద్ధ కనపరచడమే కాకుండా ప్రతీ వార్షికోత్సవాన్ని అత్యద్భుతంగా జరిపి సాహితీ పురస్కారాలను అందజేసి నగరంలోని విద్యావేత్తలను సత్కరించేవాడు . ఇలా ధరణీ మాస పత్రికను  జనాలకి బాగా అలవాటు చేశాడు.  అంతే కాకుండా కథల పోటీల ద్వారా నూతన రచయితలను కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడు ధరణీపతి. వీటన్నింటినీ ఆయన తండ్రి గారి స్మారక చిహ్నంగా నిర్వహిస్తూ ఉంటారు.

ఏడు సన్మానించ తగ్గవారి జాబితాలో ముందున్న వ్యక్తి, సారధి. ఇతడు సద్బ్రాహ్మణుడు, నియోగి బిడ్డ. వేదములలోని సారాన్ని ఆమూలాగ్రంగా చదివినవాడు. మూడు పదుల వయసు దాటకుండానే గండపెండేరం తొడిగించుకున్నవాడు. అందుకే యేడు మహారాజ సత్కారం ఇతనికే చేయాలని ధరణీపతి నిర్ణయించుకున్నారు. తన కారును లోతుకుంట వీధులలో జోరుగా నడుపుకుంటూ ఒక వేద పాఠశాల ముందు ఆపాడు. బడిలో  నుండి సారధి  ఉచ్ఛరిస్తున్న  వేదఘోష వీధి చివర వరకు ఘంటారావం లాగా వినబడుతోంది. గేటు దగ్గరే మైమరచిపోయి  ఆగిపోయాడు ధరణీపతి. సారధి పాఠం ముగించుకుని రాగానే విషయం చెప్పి, తన అంగీకారం అడిగాడు, సారధి తన సమ్మతం తెలిపాడుసారధి సన్మానానికి ఒప్పుకున్నాడన్న సంతోషంలో జాయ్ మని కారు నడుపుకుంటూ వెళ్ళిపోయాడు ధరణీపతి. దారి మధ్యన ఒకచోట తన కారు ఒకసారిగా ఆగిపోయింది. దిగి చూడగా కారు రేడియేటరు బాగా వేడెక్కిపోయి పొగలు కక్కుతోంది. చుట్టూ పరికించి చూడగా అది జనసంచారం లేని ప్రదేశంలాగా  తనకు అనిపించి, ఒక డబ్బా తీసుకుని నీటికోసం వెతికాడుఅప్పటికే ఎండ నడినెత్తికెక్కింది, తన చొక్కా అంతా చెమటతో తడిసిపోయింది. అరచేతితో తన చెమటలు తుడుచుకుంటూ చూడగా  అక్కడకు  దూరంగా ఒక పాకలాంటిది కనపడింది. అటు పోయి నీరు అడుగుదామని మండుటెండలో నడుచుకుంటూ వెళ్ళాడు.

అది దుమ్ముకొట్టి ఉన్న ఒక కల్లుపాక. వచ్చేటప్పుడు ఇది కనపడలేదే అని ఆలోచిస్తూ లోపలికి అడుగువేశాడు. అక్కడ ఎదురుకుండా ఒక 60-65 ఏళ్ళ ముసలివాడు నోటిలో చుట్ట కాల్చుకుంటూ, కల్లును గుటకవేస్తూ, చేతిలో కంజీర పట్టుకుని తత్త్వం పాడుతున్నాడు. అతని పేరు కల్లుకుండ వీరయ్య. అతను తాగినప్పుడు పరమసత్యాలని తత్త్వాలుగా జనాల మీదకు విసురుతూ ఉంటాడు" కీరితంటూ తిరిగేవు... గొప్పగా పలికేవు.. మదము పట్టి ఎగిరేవు.. నీ మూలమెక్కడ రా మడిసీ.. "  అన్న పలుకులు వినగానే ధరణీపతికి తను వచ్చిన పని మానేసి ఆలోచనలో పడిపొయాడు. మెల్లగా తను వచ్చిన పనిని వీరయ్యకు చెప్పి, నీరు తీసుకుని కారులో పోసి ఇంటికి వెళ్ళిపోయాడు ధరణీపతి

సారధి గురించి ఇన్ని విషయాలను తెలుసుకున్న తనకు తెలియని విషయం ఏమిటంటే చందమామకు మచ్చ ఉన్నట్టు సారధిలో ఒక చెడ్డ  గుణం ఉందిఅతనొక అహంభావి.  చదువురానివారిని, ఇతర వృత్తులవారిని తక్కువగా చూస్తాడు. సన్మాన ఘడియలు రానే వచ్చాయి. పెద్దలందరూ వేదికను అలంకరించి ఉన్నారు. సారధి పట్టు వస్త్రాలలో, శిరస్సున పూలకిరీటంతో కొండమీద శ్రీవారిలా ధగధగా మెరిసిపొతున్నాడు. అతన్ని సత్కరించుకునే భాగ్యం కలిగినందుకు ధరణీపతి కూడా ఆనందపరవశుడయినాడు. సన్మాన పత్రం చదివి వినిపించేలోపు, ఒక వింత రోతవాసన సభాస్థలిలో రావడం మొదలయ్యింది. ముక్కిపోయిన కంబలిదా లేదా మురిగిన కల్లు నుండి వచ్చిందా అర్ధం కాక బుర్రలు బాదుకుంటూ ఉన్నారు అక్కడకు వచ్చిన పురజనులంతా. కానీ వాసన రెండిటినీ సమంగా ఆస్వాదించే మన వీరయ్యది. అందరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకొనేలోపు, అంతలో మైకు అందుకున్నాడు ధరణీపతి.  సభికులను, కార్యక్రమానికి విచ్చేసిన వారందరినీ క్షమాపణ కోరి, సారధి గారి పక్కన వీరయ్యను కూర్చోబెట్టాడు. అది అవమానం గా భావించిన సారధి వెంటనే తన కుర్చీలో నుండి లేచిపోయాడు. తనని అవమానించారని సభాస్థలం అన్న విషయం కూడా మరిచిపోయి అరిచాడుసారధి వాదనను సాంతం విన్న ధరణీపతి, ముందు తనను శాంతపరచాలని ప్రయత్నించి విఫలమయ్యాడుఅక్కడ జరుగుతున్న కోలాహలాన్ని మూల కూర్చుని చుట్ట కాలుస్తూ చూస్తున్న వీరయ్య తనకు పట్టనట్టు గా కూర్చుని సారధి వాదన వింటున్నాడు. సారధి తన విద్య గురించి వంశం గురించి గొప్పలు చెపుతూ, వీరయ్య శూద్రుడని పదే పదే అంటూ నానా దుర్భాషలాడాడు

తను మాట్లాడవలసిన సమయం వచ్చిందని గ్రహించిన వీరయ్య, సారధితో... "అయ్యా! మీరు గొప్పగొప్ప చదువులు చదివినోళ్ళు , మీకు చెప్పెటోన్ని కాను, గ్యానవంటే అందరి మద్దెలో అరిసి గెలిసేది కాదు, నింపాదిగా అందరికీ అర్దమయ్యేలాగా సెప్పేది. హరిజనుడంటే దేవుడికి మడిసీ అని అర్ధం. సదుకున్నోడిని కాకపోయినా, నీ అయ్య వయసు ఉన్నోడిని సెపుతున్నా, తప్పుగా అనుకోమాక. సదుకున్నోడు సముద్రంతో సమానం. సముద్రం నదులలోని నీళ్ళని ఎట్టా దాస్తాదో, అట్టానే మడిసి కూడా గ్యానాన్ని సముపార్జించాల. తనలో దాస్కున్నది కెరటాల రూపంలో ఎట్టా ఒడ్డుకు సేరుత్తాదో, అట్టానే కులమత తారతమ్యాలు లేకుండా అందరికీ గ్యానాన్ని పంచాల. మాట తీయగుండాల, బుద్ది పదునుగుండాల, మనసు యెన్నలాగుండాల, అందరి మంచీ కోరాల, కష్టమొస్తే సాయానికి ఎదురునిలవాల. ఇదీ సదుకున్నోడికి ఉండాల్సిన లచ్చణాలు. ఇయ్యి లేనొడు ఎంత సదివినా, ఎన్ని నేర్సినా యర్థమే అవుతాది !!" అని ఊరుకున్నాడు.

క్షణంలో సారధికి వీరయ్య, అద్వైతం బొధించడానికి వచ్చిన చండాలునిలా కనిపించాడు. వెంటనే తన కాలికి ఉన్న గండపెండేరాన్ని తీసి తన కన్నీళ్ళతో అతనికి పాదాభిషేకం చేసి, అతని కాలికి తొడిగి ఆ పాదాల మీద తన శిరస్సును వాల్చాడు. 


ఇతిః శివం




1 comment:

  1. ఇతిః శివం అంటే అర్థం ఏమిటి?

    ReplyDelete