Sunday, February 5, 2017

సాహో సార్వభౌమ... శాతకర్ణి




ముద్దులొలకే   పసివాడు అమ్మ చేత గోరు ముద్దలు తింటూ యుద్ధం గురించి విన్న పిట్టకథ నుండి మొదలయ్యి, అదే తన ఆశయంగా మార్చుకొన్న ఒక వీరుడి కథ శాతకర్ణి . కోటి లింగాల అనే దక్షిణాది ప్రాంతం నుండి మొదలయ్యి, సహరాట్  రాజు నహపానుడి మీద జైత్రయాత్ర తో కాస్త విరమించిన  ఈ ప్రయాణం డిమిత్రియస్ అనే పరదేశీయుడి తో సలిపిన పోరుతో  ముగించబడింది . నా నిరుడు వ్యాఖ్యానం లో "Scorcese of the South " అని నేను పిలుచుకున్న అంజనాసుతుడి విరించి నుండి విరచితమయిన ఈ కథ నిజంగా కళాఖండం గా మలచబడినది. 

ముందుగా చెప్పుకోవలసినది, బాలకృష్ణ గారి అభినయం, ఆయన తెగువకు బహుపరాక్ అనవలసినదే. తన పాత్రకు ఒక నిండుతనాన్నితీసుకువచ్చి, ఒక చక్రవర్తి రాజసాన్ని చక్కగా పలికించారు. ఆయన అభినయానికి తగ్గట్టుగా ఆయన సంభాషణలు వెంట్రుకల్ని నిక్కపొడుచుకునేలాగా చేశాయి .  ముఖ్యంగా కథలోకి మనను తీసుకువెళ్లిన విధానం. 

"మిత్రమా ! ఇది మా కత్తి వాతలతో రక్తసిక్తమైన కుంతల రాజ్యంనుండి పంపుతున్న లేఖ. ఇది మా స్నేహపూర్వక హెచ్చరిక .... సమయం లేదు మిత్రమా శరణమా? రణమా ?"

"నన్ను బంధిస్తే వారొస్తారు కారాగృహంలో ఏదురుచూస్తాను ... చంపితే మీరొస్తారు కాటి వాకిట కాచుకుని ఉంటాను "

"మగనాలికి గాజులందం ... మగవారికి గాయాలు అందం"

" బడుగు జాతి కాదు తెలుగు జాతి ... అధములం కాదు ప్రథములం " 

"రాజులు రాజ్యం కోసం కత్తులు పట్టాలి ధర్మం కోసం తప్పులు పట్టాలి " ఇవి కేవలం మచ్చుకకు చెప్పుకునేవి మాత్రమే .. ఇటువంటివి కోకొల్లలు. 

మిగితా తారాగణం లో వాశిష్టి దేవి గా కనపడ్డ శ్రీయ తన నటనకు కొత్త అందం దిద్దారు. ముఖ్యంగా బిడ్డను భర్త యుద్ధానికి తీసుకువెళ్ళినపుడు విషయాన్ని వ్యక్త పరచలేక, తాను అనుభవించిన భాధను చూసిన ఎవరికైనా కళ్ళు చెమ్మగిల్లవలసినదే. గౌతమీ బాలశ్రీ గా హేమామాలిని గారు, నహపానుడి గా కబీర్ బేడీ, కళ్యాణ దుర్గాధిపతిగా మిలింద్ గునాజీ , శాతకర్ణి రాయబారులుగా శుభలేఖ సుధాకర్, భరణి గార్లు తెరకు కొత్త రంగుల్ని  అద్దారు . 

కళా విభాగం, ఛాయాచిత్ర విభాగాలు ఈ చారిత్రాత్మక చిత్రానికి రెండు కళ్ళు గా వ్యవహరించారు. ముఖ్యంగా చీకటిలో చిత్రీకరించిన సన్నివేశాలు, శివాలయంలోని బిలమార్గం, పతాక సన్నివేశం లో శాతకర్ణి అశ్వాన్ని నడుపుకుంటూ వచ్చే దృశ్యం, రాజసూయ యాగ మహాఘట్టం, బౌద్ధారామక్షేత్రం, యుద్ధ సన్నివేశాలు లాంటివి ఎన్నో ఉన్నాయి... ఆ రెండు గంటలలో కలిగిన అనుభూతిని వర్ణించడానికి మరో రెండు గంటల వ్యవధి కావాలి. 

నేపధ్య సంగీతంలో వచ్చే సాహో సార్వభౌమా, శాతకర్ణి వాశిష్టి దేవికి యుద్ధం గురించి వివరించలేక అవస్థ  పడుతున్న సమయంలో వచ్చే బుర్ర కథ, వాటికి సిరివెన్నెల గారి సాహిత్యం నభూతో నభవిష్యతి అనిపించాయి. 

ఒక కమర్షియల్ చిత్రానికి ఉండవలసిన హంగులన్నీ అద్దుతూనే తన పునాదులను బలంగా ప్రతిష్ఠించారు అంజనాసుతుడు... చివరాఖరున ఆయన రాసిన లేఖ, ఆయనకు తెలుగుభాష  మీద ఉన్న ప్రేమను వ్యక్తపరచింది.
 
ఇంతటి ఘనకీర్తిని గడించిన ఆ చక్రవర్తి ని పునః స్మరిస్తూ ... సాహో సార్వభౌమ... "గౌతమీసుత  శాతకర్ణి" బహుపరాక్ !!!




No comments:

Post a Comment