Monday, January 23, 2017

కంచె ... ఊరికి కాదు మన ఉనికికి కూడా





సామాన్యుడి కేక నిశీధిన నిదురిస్తుంది.... కానీ వీరుడి నిశ్వాస శత్రువుని సైతం కలవర పెడుతుంది.... రాచరికపు మూర్ఖత్వాలను ఒక జమీందారీ సంస్థానం అనే చిన్న శిల మీద నుండి మొదలుపెట్టి రెండో  ప్రపంచ యుద్ధం అనే ఒక మేరునగాన్ని తీసుకొని ఏకశిలానాగరాన్నే నిర్మించిన అద్భుతమైన శిల్పి క్రిష్ ... ఇది నిజంగానే కంచె .. మన ఆలోచనలకు కంచె... తోటివాడిని హెచ్చుతగ్గుల త్రాసులో తూకం వేసి మరీ మనలో కలుపుకోవాలా వద్దా అన్న ఆలోచనకు కంచె. నా మనవడు చదువుకుని వచ్చాడు అని సంబరపడుతున్న తాతకు రేపు ప్రొద్దున్న నాకు క్షవరం చేయమని ఆదేశించిన ఒక ధనికుడి సంకుచితత్వపు ధోరణికి అడ్డుకట్ట వేసుకోమని విస్మరించిన మానవత్వపు పునాదులను తవ్విన కంచె !!! 

కథ లో నాయకుడు  దూపాటి హరిబాబు  అనే ఒక సామాన్యుడు.... స్వచ్ఛమైన నీటివంటి వాడు. అందరిలో మంచిని చూడగలిగే వాడు. పరదేశీ యువతిలో కూడా తల్లిని దర్శించే మహోన్నతుడు. అన్నిటినీ మించి నమ్మిన నీతికి ప్రాణాలనైనా లెక్కచేయనివాడు. సినిమాలో నచ్చిన విషయాలు... కులమనే విషయాన్ని సరళంగా చెప్పిన తీరు అమోఘం.. ముఖ్యంగా సాయిమాధవ్ గారి సంభాషణలు, ఛలోక్తులు అద్భుతం... సంగీతం సందర్భానికి నేపథ్యానికి తగ్గట్టుగా అతికాయి... కళ, కెమేరా విభాగాల పనితనం అతి రమణీయం. 24 విభాగాల వారూ ప్రాణం పెట్టి పని చేశారు.

ఇక మాట్లాడవలసిన అసలు వ్యక్తి... రాధాకృష్ణ గారు... కుల వివక్షత మీద మీరు విసిరిన కొరడా అనిపించింది. అవసరాల జర్మన్ యువతిని అడ్డగించడం నుండి తల్లీ అని సంబోధించేంత వరకూ నడిచిన దృశ్యం అద్భుతం... ఊరిలో కంచెలకూ, దేశాల మధ్య వైరానికీ తేడాలేదని చెప్పిన అంశం.. రేపటి తరాన్ని కులరహిత సమాజం వైపుగా, విద్వేషాలకు దూరంగా నడపాలన్న ఆలోచనను hope అనే పాప జీవితాన్ని చూపిస్తూ రాబోయే ముప్పుని కూడా చూపడం వర్ణణాతీతం అనిపించింది. యుద్ధ సన్నివేశాలు ... నాకు చాలా ఇష్టమైన దర్శకులు Martin Scorsese గారి Pianist చిత్రాన్ని గుర్తుకు తెచ్చుకునేలా చేశాయి.... హరిబాబు సీత ప్రేమ సన్నివేశాలు రామాయణంలో స్వయంవరం గుర్తుకువస్తే పెళ్ళి రుక్మిణీ కళ్యాణాన్ని స్ఫురణకు తెచ్చింది... ముఖ్యంగా ముగించే ముందు మూడు విషయాలు... 1. భార్య గుర్తువచ్చినప్పుడు హరి ఉత్తరం రాస్తూ కథను ప్రేక్షకుడికి  చెప్పిన తీరు ... 2. చివరిలో తన బావ salute చేసి స్నేహితుడు అనడం.. 3. కంచె పీకమని అమ్మమ్మ తో చెప్పించడం !!!

I would like to conclude by coining Director Krish as "Scorcese of the South" !! 

Thursday, January 12, 2017

దశాబ్దపు గురువు... MANI RATNAM's గురుకాంత్ దేశాయ్



మణి రత్నం ... ఈయన సినిమా వస్తోంది అంటే అందరి ఆలోచనా  ఒక్కటే..  ఏదో కొత్త విషయం నేర్చుకునే ఆవకాశం వస్తోంది అని. అదే ఆయన ఒక వ్యక్తి మీద చిత్రం తీయబోతున్నాడని టీవీలు గోల చేస్తుంటే ఆయన చిన్న చిరునవ్వుతో కాదని తల అడ్డంగా ఊపేశారు. కానీ ఆయనకు తెలియదు సిరివెన్నెలగారి  పాట  విన్న శ్రీనివాసుడిలా ఇంకొకడు ఆయన చూపే చిత్రాన్ని చూసి స్ఫూర్తి చెందుతాడని.  దీన్ని చూసిన చాలా మందికి అర్ధమయ్యే విషయం ... ఇది  రిలయన్స్ అధినేత ధీరుభాయి అంబానీ చరిత్ర ను ఆధారం చేసుకుని తీసిన చిత్రం అని. చరిత్రలు, పూర్వాపరాలు గురించి వదిలేసి మనకిష్టమయిన సినిమా లోకి దూకేద్దాం.

లైట్స్ ఆపగానే అమితాబ్ లాంటి ఇంకో గంభీరమైన గొంతుతో కథ మొదలవుతుంది . ఆ గొంతు  ఆయన అబ్బాయి అభిషేక్ బచ్చన్ ది.  "సప్నే మత్ దేఖో ..సప్నే కభీ సచ్ నహీ హోతే.. మేరే బాపూ కెహతా థా, లేకిన్ మైనే ఏక్ సప్నా దేఖా" అనే మాటలతో మోదలవుతూనే.. గుజరాత్ లోని ఇధార్ గ్రామంలోని అతని బాల్యం లోకి దూకేస్తుంది.. వ్యాపారం చేయడానికి దేశం వదిలి వెళతానని ఒక పదమూడేళ్ల పిల్లాడు .. చదువు సరిగ్గా వెలగబెట్టు అని తండ్రి తిట్టే తిట్లు ... అటు నుండి ఇస్తాన్బుల్ .. మళ్ళీ గుజరాత్ .. సుజాత అనే అమ్మాయి కన్న కలలు... అటు నుండి రైలు లో గురు సుజాతల  పరిచయం.. స్నేహితుడిని వ్యాపారం అంటూ ఒప్పించి వాళ్ళ అక్కను పెళ్లి చేసుకుంటానని వెళ్లడం.. కాబోయే మామ ఊరి వారి సంకుచితత్వాలు గురించి చెప్పడం .. అన్నిటిని కొట్టి పారేసి పెళ్లి చేసుకుని బొంబాయి కి మకాం మార్చడం... అసోసియేషన్  సభ్యత్వం గురించి 'స్వతంత్ర  సమాచార్' దినపత్రిక అధిపతి మాణిక్ దాస్ గుప్తా ను కలవడం , వ్యాపారంలో వృద్ధి, భార్యాభర్తల మధ్యన తగువు.. గురుకాంత్ గురుభాయ్ గా ఎదగడం ... మాణిక్ దాస్ గురు కు ప్రత్యర్థి గా మారి  శ్యామ్ సక్సేనా అనే వ్యక్తిని గురుభాయ్ రహస్యాలను బట్ట బయలు చేయమని ఆజ్ఞాపించడం వరకూ చకచకా కన్నార్పనివ్వకుండా, రెప్పపాటులో  జరిగిపోతాయి. విశ్రాంతి సమయానికి  అద్భుతమైన మాట తో ముగిస్తారు మణిరత్నం .... "శ్యామ్ భాయ్! గురుభాయ్ సే లడ్నా, తో గురుభాయ్ బన్కే లడ్నా"  అని ... అక్కడి నుండి పోలిస్టర్ ఫ్యాక్టరీ నుండి పెట్రో కెమికల్ ఫ్యాక్టరీను కట్టేదాకా ఆయన అనుభవించిన వ్యయప్రయాసల గురించి, దొంగ దోపిడీ అనే వార్తల నుండి షేర్ మార్కెట్ లబ్ధిదారుల దాకా, సుజాత గారు "50 పర్సెంట్ పార్ట్నర్ హై సాబ్" అని అందించే స్ఫూర్తి నుండి .. "తుమ్హారే పేట్ మే సారే పచ్చిస్ హజార్ లోగ్ హై " అని విసిరే ఛలోక్తుల దాకా అన్నీ అద్భుతంగా కుదిరాయి.

ఇక సినిమా లోని తారాగణం గురించి చెప్పుకోవాలి .. మణి రత్నం గారి సినిమాకు వన్నె తెచ్చేదే ఆయన ఎంచుకునే నటీనటులు.. ముఖ్యంగా గురుకాంత్ దేశాయ్ గా జనాల ముందుకు వచ్చిన అభిషేక్ బచ్చన్. అవ్వడానికి అమితాబ్ గారి వారసుడైనా అప్పటి దాకా అతని మీద ఒక చిత్రాన్ని పూర్తిగా వదలవచ్చు అనే నమ్మకం ఎవరికీ కలిగి ఉండకపోవచ్చు.  కానీ పతాక సన్నివేశాలలో అతని నటన చుస్తే నటన "కమల్ హాసన్" నాయగన్ ను తలపిస్తుంది.  తరువాత సుజాతగా అలరించిన ఐశ్వర్యా రాయ్, వీరిద్దరి జోడి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. తేరే బినా పాట లోని నాట్యం, బర్సో రే మేఘా లో సుజాత గారి స్వతంత్ర భావాలు చూడదగ్గవి. వీళ్ళ మధ్యలో ఇంకొక జంట శ్యామ్ పాత్ర వేసిన మాధవన్, తన భార్యగా విద్యా బాలన్. మాణిక్ దాస్ గా మిథున్ నుండి ఐఏఎస్ అధికారి గా నటించిన ప్రతాప్ పోతన్ వరకు అందరూ పాత్రలకు గౌరవం హుందాతనం తీసుకువచ్చారు. 

ఇంక టెక్నికల్ విషయాలకు వస్తే గుల్జార్ కాలానికి రెహ్మాన్ సంగీతం.  రెహ్మాన్ గారి బాణీలు  అప్పటికీ ఇప్పటికి కూడా శ్రావ్యంగా ఉంటాయి, దానికి ఉదాహరణ సుజాత పాడే బరసో రే మేఘా అనే పాట. ఈ పాట పుట్టక మునుపు అందరి నోటివెంబట మేరే ఖాబో అని పాడే అమ్మాయిలు, ఇక్కడ నుండి ఈ పాటను  వదలలేదు. సమీర్ చందా గారి కళకు రాజీవ్ మీనన్ గారి కెమెరా పనితనం కళ్ళకు పండుగలాగా ఉంది .నవీ ముంబాయి నుండి తమిళ నాడు, ఆంధ్రలో తీసిన దృశ్యాల వరకు మల్లికా షెరావత్ నర్తించిన పాట నుండి ఏక్ లో ఏక్ ముప్త్ పాట వరకు ప్రతీ సెకను మనల్ని నోర్లు వెళ్ళబెట్టేలాగా చేస్తుంది. 

ఆకాశంలో చుక్కలెన్ని ఉన్నా చందమామ మాత్రం దర్శకుడు మణిరత్నం అనాలి . నిరుడు తరం కథ ఎంచుకోడమే కాదు మనల్ని ఆ కాలంలోకి టైం ట్రావెల్ చేయించే ప్రయత్నం చేశారు, ప్రతీ ఫ్రేము నుండి మనల్ని 1950లలోకి తీసుకువెళ్లారు. ముఖ్యంగా టైటిల్ కార్డులో అక్షరాలను టైపురైటర్ కొడుతున్నట్టు వెయ్యడం నుండి సినిమా ఆద్యంతం ఒక రస్టిక్ బ్రౌన్ కలర్ లో చూపించడం. ఇలాంటి ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు ఈ సినిమా నుండి. 

అలాంటి సినిమా కి ఇవాళ పదేళ్ళు నిండాయి అని చెప్పుకోడానికి గర్వపడుతున్నాను. మణిరత్నం గారు రాబోయే "కాట్రు వెళియిడై"తో మంచి విజయం సాధించి అలానే ఇంకొన్ని విషయాలను నేర్పుతారని ఆసిస్తూ .... 

Saturday, January 7, 2017

2016... సినిమా... మరోప్రస్థానం

  • 2016 లో ఒక మంచి సినిమా అనగానే గుర్తుకొచ్చే చిత్రం... మనమంతా!! ఇది అందరికోసం తీసిన కథ కాకపోవచ్చు కానీ ఇది మన అందరి కథ. మన మధ్యన జరిగే ఒక మధ్య తరగతి కథ. ఇందులో నటించిన మోహన్ లాల్ అనే మలయాళ నటుడికి 6 పాక్ లేకపోవచ్చు, గౌతమి గారికి గ్లామర్ తగ్గుండచ్చు కానీ నటన పరంగా అందరూ (పిల్లల తో సహా) వారి వారి పరిమితికి మించి నటించారు. ముఖ్యంగా చెప్పుకోవలసింది తెరవెనుక పనిచేసిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఒక్కరే కాదు,  ప్రతీ రచయితనూ కూడా   (మాటలు, పాటలు). 
  1. బండి పంక్చర్ అవ్వగానే మెకానిక్ తో  "ట్యూబ్ వచ్ఛే నెల మార్చవచ్చు ముందు ఆ కన్నం వెతికి పూడ్చరా " ఇలాంటి మాటలు మధ్య తరగతి వారి జేబు కున్న నెలసరి  పరిమితిని గుర్తు చేస్తాయి. 
  2. "షుగరు పేషెంట్లకి  షుగరు లెస్ స్వీట్స్ ఉన్నట్టు, అల్సర్ పేషెంట్లకి కారం లేని పచ్చళ్ళు అమ్మటం " అనేది ఒక మధ్య తరగతి వాడికి సంపాదన మీద ఉన్న కోరికకు అద్దం పడతాయి . 
  3. "బ్రతకడం నేర్చుకుంటూ మనిషిలా బ్రతకడం మరిచిపోయాను", "తలకి తుపాకీ గురిపెట్టినా ఆయన పధ్ధతి తప్పలేదు , చిన్న తలనొప్పికే నేను అడ్డదార్లు వెతికాను .. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు నేను కనీసం మనిషిగా కూడా మిగలలేకపోయాను" లాంటి మాటలు మానవతా విలువలను తట్టి లేపుతాయి. 
  4. "ఏ ఆలోచనతో జన్మించింది జగతి" లాంటి పాటలు మనసుకు హత్తుకుంటాయి... కళ్ళవెంబట వెచ్చని కన్నీటితో మన మనస్సులను ప్రక్షాళన చేస్తాయి. 
  5. ఈ చిత్రానికి ఉన్న మరో గొప్ప సంగతి... మలయాళo  కు చెందిన   మోహన్ లాల్ గారు తన పాత్ర కు తానే గాత్రం చెప్పుకోవడం ... రాయలు వారు అన్నట్టు " దేశ భాష లందు తెలుగు లెస్స " అన్న నానుడి గుర్తుకువస్తుంది. 
  6. "పర్సుయిట్ అఫ్ హ్యాపీనెస్" లాంటి చిత్రానికి ఏమాత్రం తీసిపోని క్లాసిక్ గా ఇది కూడా మిగిలిపోతుంది . 
  • జ్యో అచ్యుతానంద : ఈ ఏడాది వచ్చిన మరో అద్భుతమైన చిత్రాలలో ఒకటి. అన్నదమ్ముల మధ్యన ప్రేమనే కాదు, కోపతాపాలలోని కష్టాలని, కుటుంబం విడిపోతే కలిగే నష్టాలని  అద్భుతంగా తెరకెక్కించారు శ్రీనివాస్  అవసరాల. 
  1. ప్రథమంగా  ఆయన రాసిన మాటలకు నిజంగానే మంత్రముగ్ధులు అవ్వకతప్పదు. 
  2. "మేము ఇద్దరం ఓ , ఓయి , ఓసి , అని సంబోధనా ప్రధమా విభక్తిలో మాట్లాడుకుంటాం " లాంటి సంభాషణలు భాషకు పునర్వవైభావాన్ని తెచ్చిపెట్టాయి. "సంతోషం గా ఎలాగో లేరు కనీసం సుఖంగా ఉండండి " అని అమ్మ చెప్పే మాట, "తండ్రి స్థానంలోకి రావడానికి ఇచ్చిన గిఫ్ట్ " లాంటి మాటలు కళ్ళను చెమరుస్తాయి. 
  3. "ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటున " కళ్యాణ్ గారి స్వరానికి శంకర్ మహదేవన్ గారి గాత్రం  మరింత మాధుర్యాన్ని జోడించింది. 
  4. రోహిత్, నాగ సౌర్య, రెజీనా నటన, అన్నీ కలగలిపి మామూలు చిత్రంగా కనపడుతూ ఒక చక్కని సినిమా గా రూపుదిద్దుకుని మంచి విజయాన్ని సాధించింది. 
  • క్షణం : స్క్రీన్ ప్లే ఆధారం గా తెరకెక్కింది ఈ చిత్రం అని ఎన్నో సార్లు విన్నా, కథనానికి పెద్ద పీట వేసిన చిత్రం క్షణం. వాణిజ్య విలువలు ఏ మాత్రం తగ్గకుండా అలాగే అనవసరమైన ఖర్చు పెట్టకుండా సూటిగా కథలోకి దూసుకెళ్లిపోతుంది "క్షణం ". అడవి శేష్, అదా శర్మ , కిషోర్ అభినయం ఒక్కటే కాదు, దర్శకత్వం వహించిన రవికాంత్ ఒక్కరే కాదు, ప్రతి ఒక్క టెక్నీషియన్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ చిత్రం. 
  • అ .. ఆ : గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి విజయావారి చిత్రాలను ఆదరించే ప్రతి ఒక్కరికి త్రివిక్రమ్ గారు మళ్ళీ ఇచ్చిన మరచిపోలేని చిత్రం. అ ఆ ... అవ్వడానికి మాతృక మీనా అనే నవల ఆధారంగా తెరకెక్కినా, నేటి కాలానికి తగ్గట్టుగా అన్ని మార్పులు చేసి చాలా స్టయిలిష్ గా  తీశారు త్రివిక్రమ్ గారు. పాత్రలు మాట్లాడే యాస వ్యవహరించే తీరే కాదు , వారి పేర్లనుండి తెలుగుతనం ఉట్టిపడే లాగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఆయన. పల్లం వెంకన్న పాత్ర ఎంత తంపులు పెట్టే రకమైనా అతని మాటలు ఛలోక్తులు ఆద్యంతం నవ్వులు కురిపిస్తాయి. ముఖ్యంగా మనం గుర్తుతెచ్చుకునేది పల్లెటూరిని ఇంకా అందంగా చిత్రించిన కెమెరామన్  నటరాజన్ సుబ్రమణియం (నట్టి) గారి కెమెరా  పనితనం. యా యా పాటలో రామజోగయ్య శాస్త్రి గారి పదానికి మిక్కీ అందించిన స్వరానికి ఏ మాత్రం తీసిపోకుండా అద్భుతంగా చిత్రించారు. 
  • పెళ్లిచూపులు : పెళ్లి అనే ఒక మామూలు విషయం చుట్టూ అల్లిన అల్లిబిల్లి కథ లా చక్కగా ఉంటుంది ఈ చిత్రం. ప్రశాంత్, కౌశిక్ లాంటి పాత్రలు రోజూ మనకు తారసపడుతూ ఉంటాయి . ఆఖరున "నా సావు నేను చస్తా నీకెందుకు " అద్భుతంగా పేలిన జోకు. ఆద్యంతం హాస్యాస్పదంగా సాగిపోతూ మంచి వినోదాన్ని పంచింది. 
  • బ్రహ్మోత్సవం: ఒక మహేష్ సినిమా... భావుకత ఎక్కువయ్యో లేదా లెక్కలు సరిగ్గా కుదరకో అనుకున్న ఫలితం రాకున్నాకూడా ఎన్నో మంచి విషయాలను నింపుకున్న చిత్రం ఇది . ముఖ్యంగా రావు రమేష్, మహేష్ ల పాత్రలు ప్రవర్తించే తీరు నటులుగా వారిని ఒక మెట్టు పైకి ఎక్కించింది. "అలసిపోయేంతవరకు కాదు అర్ధమయ్యే వరకు వెతుకు" "నలుగురు చుట్టూ ఉన్నారు నాకేంటి ?" లాంటి మాటలు మనను ఆలోచింపచేస్తాయి. 
  • ఇంకా ఈ సంవత్సరం లో వచ్చిన ఎన్నో అద్భుతాలు తండ్రి బాధను  తీర్చి ఆయన ఆఖరి క్షణాలను ఆనందంగా మార్చిన  సుకుమార్ గారి " నాన్నకు ప్రేమతో", బాపుగారి పెళ్ళిపుస్తకం ని తలపించే "కళ్యాణ వైభోగమే", రోహిత్ అందించిన "అప్పట్లో ఒకడుండేవాడు", అంతస్థులు వేరైనా మనిషి గుండె సడి ఒక్కటే, మనిషి పంచే ప్రేమ ఒక్కటే అని ఒక ఫారిన్ చిత్రం ఆధారంగా వచ్చిన నాగార్జున కార్తీ ల "ఊపిరి", మనిషి చనిపోయినా ప్రేమ కు చావులేదు అని చూపించిన  నిఖిల్ "ఎక్కడికిపోతావు చిన్నవాడా?" , రామ్ అందించిన "నేను శైలజ", కొరటాల శివ "జనతా గారేజ్" , రాంచరణ్ "ధృవ" , శర్వానంద్ "ఎక్సప్రెస్ రాజా", మోహన్ కృష్ణ గారి "జెంటిల్ మాన్ " , ప్రవీణ్ సత్తారు "గుంటూరు టాకీస్" , సోగ్గాడి సరదాలు తో పాటు ఒక అందమైన పల్లెటూరి కథ తో సంక్రాంతి అల్లుడి లాగా దిగిన కళ్యాణ్ కృష్ణ "సొగ్గాడే చిన్నినాయన", మూఢనమ్మకాలు వీడి  ఆత్మవిశ్వాసం తో ఏ పనైనా చేయవచ్చు అని చూపిన శ్రీనివాస్ రెడ్డి "జయమ్ము నిశ్చయమ్మురా" , మళయాళ చిత్రాన్ని ధీటుగా సవాలు చేసిన చందు మొండేటి  "ప్రేమమ్" , ఆహ్లాదకరమైన ఒక స్నేహమనే ప్రయాణం నుండి మొదలై ఒక యండమూరి డిటెక్టివ్ నవల లాగా మలుపులు తిరిగే గౌతమ్ మీనన్ "సాహసం శ్వాసగా సాగిపో" లాంటి మంచి సినిమాలు అందించింది 2016. 
2017 ఇంకా మంచి చిత్రాలను అందిస్తుంది అని ఆశిస్తూ నూతన సంవత్సరాన్ని స్వాగతిద్దాం.