Sunday, September 10, 2017

అర్జున్ రెడ్డి... ఇది శరీరం కాదు.... ఒకడి జీవితం


ఒక తెల్ల కాగితం మీద పడిన సిరామరక... పసి వాడి ఏడుపు... సముద్రపు అలల నురగలు తాకినప్పుడు కలిగే ఆనందం... వర్షంలో తడిస్తే పట్టే జలుబు.. కొత్త ఆవకాయ తింటే వచ్చే మంట.. చీమ కుడితే పుట్టే నొప్పి... మోసం చేసినవ్యక్తిని చూస్తే కలిగే అసహ్యం.... ఇవన్నీ అందరి జీవితాలలో ఎంత సహజమో.... The Same is ARJUN REDDY!!!

నన్ను అడిగితే ఈ సినిమా పేరు ప్రీతీ శెట్టి అని పెడతా..... ఎందుకంటే అర్జున్ కన్నా ప్రతీ సన్నివేశం లో అమ్మాయి ఇంకా ముందుచూపుతో వ్యవహరిస్తోంది అనిపించింది. కానీ ఇక్కడ రచయిత సందీప్ చెప్పినట్టు ఈ కధ అన్నీ సవ్యంగా ఉన్న వ్యక్తి గురించి కాదు, తన కోపాన్ని హద్దుల్లో పెట్టుకోలేని ఒక యువకుడు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అనేది ముందుగా గుర్తించాలి.

నాకు బాగా నచ్చిన రచయిత చెప్పినట్టు ముందుగా ఒక మంచి మాట దీని గురించి చెప్పాలంటే అర్జున్ అనే వ్యక్తి తన మితిమీరిన కోపం అనే ఒక వ్యక్తిత్వం వల్ల ఏం కోల్పోయాడో చెప్పడమే సందీప్ ఎంచుకున్న మూలకథ అనుకోవచ్చు.. ఇందులో హీరో ఎం చేశాడో, ఎలా ప్రవర్తించాడో , ఏం జరిగిందో...చూసినవాళ్ళకి చెప్పనక్కర్లేదు... చూడని వాళ్ళు ఎలాగయినా చూసి తీరతారు... థియేటర్లలో అయినా, టీవీలో అయినా, లేదా మనం బ్రతుకుతున్న ఈ సమాజంలో అయినా. కానీ చూడటం మాత్రం పక్కా ఎందుకంటే ఇది చిత్రం కాదు జీవితం!

ఇంక సన్నివేశాల గురించి ప్రస్తావిస్తే నాకు తెలిసినంత వరకు అసభ్యత అనేది భాషలో చూసే చూపులో మాట్లాడే మాటల్లో (ఒకటి రెండు చోట్ల వాడిన పదజాలం) తప్ప శారీరికంగా ఏ ఒక్క పాత్ర ను కించపరచలేదు అనేది నా ఆలోచన. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన నలుగురు (దర్శకుడిని విజయ్ ని మినహాయించి)... మొదట శాలిని పాండే... ప్రీతీ శెట్టి, తన కళ్ళలో ఎక్కడా నటిస్తున్నాను అన్న అనుమానం కూడా కలగనివ్వలేదు. నటన మీద తనకున్న తపన కనపడింది, రెండు సైన్మా అనే లఘు చిత్రం ద్వారా పరిచయం అయిన రాహుల్ రామకృష్ణ.. ఒక స్నేహితుడిగా అర్జున్ కాలేజ్లోనే కాదు కష్టాల్లో కూడా తోడున్నాడు, అందాల రాక్షసి తో పరిచయమయిన రధన్ తన సంగీతం తో చిత్రాన్ని మరొక దృశ్యకావ్యంగా మలిచే ప్రయత్నం చేశాడు. ఇంక ఆఖరు వ్యక్తి కాదు కాదు అసలు చిత్రానికి అసలు మొదటి వ్యక్తి. అంటే ఆఖరులో అసలు విషయం చెపితే ఎక్కువ బాగుంటుంది అని ఇలా రాశా... మా నానమ్మ.... కాంచన గారు. LET HIM SUFFER HIS PAIN అనే ఒక్క మాట చాలు ఆవిడ విషయాన్ని ఎలా తీసుకుంటారు అనేది. ఎంతో మంది మేధావులు ప్రముఖులు ఎన్నో అర్ధాలు వ్యర్ధాలు చెపుతున్నారు, అది వారిష్టం.


Cheers to entire team  And Yes this is Strictly for ADULTS.. Not for people who crossed 18+ but strictly for people with matured thought process n mindset !!! ఎంత మచ్యూరిటీ కావాలంటే నానమ్మ చివర్లో మనవడికి ఇచ్చే సమాధానమంత !! People who keep a COUNT can ignore this masterpiece...  and yes I would place this films after Deewar, Agneepath and DevD !!!

Wednesday, June 7, 2017

ఇతిః శివం

అది శరదృతువు. ఆ ప్రదేశమంతా ఆకుపచ్చని రంగులో మునిగి తేలుతోంది. ఇన్నాళ్ళుగా మబ్బుల మాటున దాగిన వెన్నెల, మబ్బులను వీడి కొత్త పుంతలు దిద్దుకుని నిశిరాత్రిలో వెలగనారంభించింది. ఆ ప్రాకృతిక సౌందర్యాన్ని చూసిన ఎవ్వరికైనా కలము పట్టి  కోటి ఊహలలో  తేలి ఆడాలనిపిస్తుంది.  ఇంటి డాబా మీద కూర్చున్న ధరణీపతి ఆ అందాలను ఆస్వాదిస్తూ చిరు దరహాసాన్ని పెదవుల పైన పూసుకొని తన గదిలోకి నడిచాడు. 

ధరణీపతి నగరంలోని  ఒక ప్రముఖ  మాస పత్రికకు యజమాని. ఆ పత్రిక పేరు ధరణి. సోషల్ మీడియా, విస్తృతంగా పెరిగిపోయిన టీవీ చానెళ్ల మధ్యన కూడా పత్రికను సర్క్యూలేషన్ ఏమాత్రం తగ్గకుండా  దిగ్విజయంగా నడిపిస్తున్నారు ఆయన. దానికి ఒకానొక కారణం కాలానికి తగ్గట్టు ఆయన కూడా ప్రచురించే ప్రతీ విషయంలో నిశితమైన శ్రద్ధ కనపరచడమే కాకుండా ప్రతీ వార్షికోత్సవాన్ని అత్యద్భుతంగా జరిపి సాహితీ పురస్కారాలను అందజేసి నగరంలోని విద్యావేత్తలను సత్కరించేవాడు . ఇలా ధరణీ మాస పత్రికను  జనాలకి బాగా అలవాటు చేశాడు.  అంతే కాకుండా కథల పోటీల ద్వారా నూతన రచయితలను కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడు ధరణీపతి. వీటన్నింటినీ ఆయన తండ్రి గారి స్మారక చిహ్నంగా నిర్వహిస్తూ ఉంటారు.

ఏడు సన్మానించ తగ్గవారి జాబితాలో ముందున్న వ్యక్తి, సారధి. ఇతడు సద్బ్రాహ్మణుడు, నియోగి బిడ్డ. వేదములలోని సారాన్ని ఆమూలాగ్రంగా చదివినవాడు. మూడు పదుల వయసు దాటకుండానే గండపెండేరం తొడిగించుకున్నవాడు. అందుకే యేడు మహారాజ సత్కారం ఇతనికే చేయాలని ధరణీపతి నిర్ణయించుకున్నారు. తన కారును లోతుకుంట వీధులలో జోరుగా నడుపుకుంటూ ఒక వేద పాఠశాల ముందు ఆపాడు. బడిలో  నుండి సారధి  ఉచ్ఛరిస్తున్న  వేదఘోష వీధి చివర వరకు ఘంటారావం లాగా వినబడుతోంది. గేటు దగ్గరే మైమరచిపోయి  ఆగిపోయాడు ధరణీపతి. సారధి పాఠం ముగించుకుని రాగానే విషయం చెప్పి, తన అంగీకారం అడిగాడు, సారధి తన సమ్మతం తెలిపాడుసారధి సన్మానానికి ఒప్పుకున్నాడన్న సంతోషంలో జాయ్ మని కారు నడుపుకుంటూ వెళ్ళిపోయాడు ధరణీపతి. దారి మధ్యన ఒకచోట తన కారు ఒకసారిగా ఆగిపోయింది. దిగి చూడగా కారు రేడియేటరు బాగా వేడెక్కిపోయి పొగలు కక్కుతోంది. చుట్టూ పరికించి చూడగా అది జనసంచారం లేని ప్రదేశంలాగా  తనకు అనిపించి, ఒక డబ్బా తీసుకుని నీటికోసం వెతికాడుఅప్పటికే ఎండ నడినెత్తికెక్కింది, తన చొక్కా అంతా చెమటతో తడిసిపోయింది. అరచేతితో తన చెమటలు తుడుచుకుంటూ చూడగా  అక్కడకు  దూరంగా ఒక పాకలాంటిది కనపడింది. అటు పోయి నీరు అడుగుదామని మండుటెండలో నడుచుకుంటూ వెళ్ళాడు.

అది దుమ్ముకొట్టి ఉన్న ఒక కల్లుపాక. వచ్చేటప్పుడు ఇది కనపడలేదే అని ఆలోచిస్తూ లోపలికి అడుగువేశాడు. అక్కడ ఎదురుకుండా ఒక 60-65 ఏళ్ళ ముసలివాడు నోటిలో చుట్ట కాల్చుకుంటూ, కల్లును గుటకవేస్తూ, చేతిలో కంజీర పట్టుకుని తత్త్వం పాడుతున్నాడు. అతని పేరు కల్లుకుండ వీరయ్య. అతను తాగినప్పుడు పరమసత్యాలని తత్త్వాలుగా జనాల మీదకు విసురుతూ ఉంటాడు" కీరితంటూ తిరిగేవు... గొప్పగా పలికేవు.. మదము పట్టి ఎగిరేవు.. నీ మూలమెక్కడ రా మడిసీ.. "  అన్న పలుకులు వినగానే ధరణీపతికి తను వచ్చిన పని మానేసి ఆలోచనలో పడిపొయాడు. మెల్లగా తను వచ్చిన పనిని వీరయ్యకు చెప్పి, నీరు తీసుకుని కారులో పోసి ఇంటికి వెళ్ళిపోయాడు ధరణీపతి

సారధి గురించి ఇన్ని విషయాలను తెలుసుకున్న తనకు తెలియని విషయం ఏమిటంటే చందమామకు మచ్చ ఉన్నట్టు సారధిలో ఒక చెడ్డ  గుణం ఉందిఅతనొక అహంభావి.  చదువురానివారిని, ఇతర వృత్తులవారిని తక్కువగా చూస్తాడు. సన్మాన ఘడియలు రానే వచ్చాయి. పెద్దలందరూ వేదికను అలంకరించి ఉన్నారు. సారధి పట్టు వస్త్రాలలో, శిరస్సున పూలకిరీటంతో కొండమీద శ్రీవారిలా ధగధగా మెరిసిపొతున్నాడు. అతన్ని సత్కరించుకునే భాగ్యం కలిగినందుకు ధరణీపతి కూడా ఆనందపరవశుడయినాడు. సన్మాన పత్రం చదివి వినిపించేలోపు, ఒక వింత రోతవాసన సభాస్థలిలో రావడం మొదలయ్యింది. ముక్కిపోయిన కంబలిదా లేదా మురిగిన కల్లు నుండి వచ్చిందా అర్ధం కాక బుర్రలు బాదుకుంటూ ఉన్నారు అక్కడకు వచ్చిన పురజనులంతా. కానీ వాసన రెండిటినీ సమంగా ఆస్వాదించే మన వీరయ్యది. అందరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకొనేలోపు, అంతలో మైకు అందుకున్నాడు ధరణీపతి.  సభికులను, కార్యక్రమానికి విచ్చేసిన వారందరినీ క్షమాపణ కోరి, సారధి గారి పక్కన వీరయ్యను కూర్చోబెట్టాడు. అది అవమానం గా భావించిన సారధి వెంటనే తన కుర్చీలో నుండి లేచిపోయాడు. తనని అవమానించారని సభాస్థలం అన్న విషయం కూడా మరిచిపోయి అరిచాడుసారధి వాదనను సాంతం విన్న ధరణీపతి, ముందు తనను శాంతపరచాలని ప్రయత్నించి విఫలమయ్యాడుఅక్కడ జరుగుతున్న కోలాహలాన్ని మూల కూర్చుని చుట్ట కాలుస్తూ చూస్తున్న వీరయ్య తనకు పట్టనట్టు గా కూర్చుని సారధి వాదన వింటున్నాడు. సారధి తన విద్య గురించి వంశం గురించి గొప్పలు చెపుతూ, వీరయ్య శూద్రుడని పదే పదే అంటూ నానా దుర్భాషలాడాడు

తను మాట్లాడవలసిన సమయం వచ్చిందని గ్రహించిన వీరయ్య, సారధితో... "అయ్యా! మీరు గొప్పగొప్ప చదువులు చదివినోళ్ళు , మీకు చెప్పెటోన్ని కాను, గ్యానవంటే అందరి మద్దెలో అరిసి గెలిసేది కాదు, నింపాదిగా అందరికీ అర్దమయ్యేలాగా సెప్పేది. హరిజనుడంటే దేవుడికి మడిసీ అని అర్ధం. సదుకున్నోడిని కాకపోయినా, నీ అయ్య వయసు ఉన్నోడిని సెపుతున్నా, తప్పుగా అనుకోమాక. సదుకున్నోడు సముద్రంతో సమానం. సముద్రం నదులలోని నీళ్ళని ఎట్టా దాస్తాదో, అట్టానే మడిసి కూడా గ్యానాన్ని సముపార్జించాల. తనలో దాస్కున్నది కెరటాల రూపంలో ఎట్టా ఒడ్డుకు సేరుత్తాదో, అట్టానే కులమత తారతమ్యాలు లేకుండా అందరికీ గ్యానాన్ని పంచాల. మాట తీయగుండాల, బుద్ది పదునుగుండాల, మనసు యెన్నలాగుండాల, అందరి మంచీ కోరాల, కష్టమొస్తే సాయానికి ఎదురునిలవాల. ఇదీ సదుకున్నోడికి ఉండాల్సిన లచ్చణాలు. ఇయ్యి లేనొడు ఎంత సదివినా, ఎన్ని నేర్సినా యర్థమే అవుతాది !!" అని ఊరుకున్నాడు.

క్షణంలో సారధికి వీరయ్య, అద్వైతం బొధించడానికి వచ్చిన చండాలునిలా కనిపించాడు. వెంటనే తన కాలికి ఉన్న గండపెండేరాన్ని తీసి తన కన్నీళ్ళతో అతనికి పాదాభిషేకం చేసి, అతని కాలికి తొడిగి ఆ పాదాల మీద తన శిరస్సును వాల్చాడు. 


ఇతిః శివం




Sunday, February 5, 2017

సాహో సార్వభౌమ... శాతకర్ణి




ముద్దులొలకే   పసివాడు అమ్మ చేత గోరు ముద్దలు తింటూ యుద్ధం గురించి విన్న పిట్టకథ నుండి మొదలయ్యి, అదే తన ఆశయంగా మార్చుకొన్న ఒక వీరుడి కథ శాతకర్ణి . కోటి లింగాల అనే దక్షిణాది ప్రాంతం నుండి మొదలయ్యి, సహరాట్  రాజు నహపానుడి మీద జైత్రయాత్ర తో కాస్త విరమించిన  ఈ ప్రయాణం డిమిత్రియస్ అనే పరదేశీయుడి తో సలిపిన పోరుతో  ముగించబడింది . నా నిరుడు వ్యాఖ్యానం లో "Scorcese of the South " అని నేను పిలుచుకున్న అంజనాసుతుడి విరించి నుండి విరచితమయిన ఈ కథ నిజంగా కళాఖండం గా మలచబడినది. 

ముందుగా చెప్పుకోవలసినది, బాలకృష్ణ గారి అభినయం, ఆయన తెగువకు బహుపరాక్ అనవలసినదే. తన పాత్రకు ఒక నిండుతనాన్నితీసుకువచ్చి, ఒక చక్రవర్తి రాజసాన్ని చక్కగా పలికించారు. ఆయన అభినయానికి తగ్గట్టుగా ఆయన సంభాషణలు వెంట్రుకల్ని నిక్కపొడుచుకునేలాగా చేశాయి .  ముఖ్యంగా కథలోకి మనను తీసుకువెళ్లిన విధానం. 

"మిత్రమా ! ఇది మా కత్తి వాతలతో రక్తసిక్తమైన కుంతల రాజ్యంనుండి పంపుతున్న లేఖ. ఇది మా స్నేహపూర్వక హెచ్చరిక .... సమయం లేదు మిత్రమా శరణమా? రణమా ?"

"నన్ను బంధిస్తే వారొస్తారు కారాగృహంలో ఏదురుచూస్తాను ... చంపితే మీరొస్తారు కాటి వాకిట కాచుకుని ఉంటాను "

"మగనాలికి గాజులందం ... మగవారికి గాయాలు అందం"

" బడుగు జాతి కాదు తెలుగు జాతి ... అధములం కాదు ప్రథములం " 

"రాజులు రాజ్యం కోసం కత్తులు పట్టాలి ధర్మం కోసం తప్పులు పట్టాలి " ఇవి కేవలం మచ్చుకకు చెప్పుకునేవి మాత్రమే .. ఇటువంటివి కోకొల్లలు. 

మిగితా తారాగణం లో వాశిష్టి దేవి గా కనపడ్డ శ్రీయ తన నటనకు కొత్త అందం దిద్దారు. ముఖ్యంగా బిడ్డను భర్త యుద్ధానికి తీసుకువెళ్ళినపుడు విషయాన్ని వ్యక్త పరచలేక, తాను అనుభవించిన భాధను చూసిన ఎవరికైనా కళ్ళు చెమ్మగిల్లవలసినదే. గౌతమీ బాలశ్రీ గా హేమామాలిని గారు, నహపానుడి గా కబీర్ బేడీ, కళ్యాణ దుర్గాధిపతిగా మిలింద్ గునాజీ , శాతకర్ణి రాయబారులుగా శుభలేఖ సుధాకర్, భరణి గార్లు తెరకు కొత్త రంగుల్ని  అద్దారు . 

కళా విభాగం, ఛాయాచిత్ర విభాగాలు ఈ చారిత్రాత్మక చిత్రానికి రెండు కళ్ళు గా వ్యవహరించారు. ముఖ్యంగా చీకటిలో చిత్రీకరించిన సన్నివేశాలు, శివాలయంలోని బిలమార్గం, పతాక సన్నివేశం లో శాతకర్ణి అశ్వాన్ని నడుపుకుంటూ వచ్చే దృశ్యం, రాజసూయ యాగ మహాఘట్టం, బౌద్ధారామక్షేత్రం, యుద్ధ సన్నివేశాలు లాంటివి ఎన్నో ఉన్నాయి... ఆ రెండు గంటలలో కలిగిన అనుభూతిని వర్ణించడానికి మరో రెండు గంటల వ్యవధి కావాలి. 

నేపధ్య సంగీతంలో వచ్చే సాహో సార్వభౌమా, శాతకర్ణి వాశిష్టి దేవికి యుద్ధం గురించి వివరించలేక అవస్థ  పడుతున్న సమయంలో వచ్చే బుర్ర కథ, వాటికి సిరివెన్నెల గారి సాహిత్యం నభూతో నభవిష్యతి అనిపించాయి. 

ఒక కమర్షియల్ చిత్రానికి ఉండవలసిన హంగులన్నీ అద్దుతూనే తన పునాదులను బలంగా ప్రతిష్ఠించారు అంజనాసుతుడు... చివరాఖరున ఆయన రాసిన లేఖ, ఆయనకు తెలుగుభాష  మీద ఉన్న ప్రేమను వ్యక్తపరచింది.
 
ఇంతటి ఘనకీర్తిని గడించిన ఆ చక్రవర్తి ని పునః స్మరిస్తూ ... సాహో సార్వభౌమ... "గౌతమీసుత  శాతకర్ణి" బహుపరాక్ !!!




Monday, January 23, 2017

కంచె ... ఊరికి కాదు మన ఉనికికి కూడా





సామాన్యుడి కేక నిశీధిన నిదురిస్తుంది.... కానీ వీరుడి నిశ్వాస శత్రువుని సైతం కలవర పెడుతుంది.... రాచరికపు మూర్ఖత్వాలను ఒక జమీందారీ సంస్థానం అనే చిన్న శిల మీద నుండి మొదలుపెట్టి రెండో  ప్రపంచ యుద్ధం అనే ఒక మేరునగాన్ని తీసుకొని ఏకశిలానాగరాన్నే నిర్మించిన అద్భుతమైన శిల్పి క్రిష్ ... ఇది నిజంగానే కంచె .. మన ఆలోచనలకు కంచె... తోటివాడిని హెచ్చుతగ్గుల త్రాసులో తూకం వేసి మరీ మనలో కలుపుకోవాలా వద్దా అన్న ఆలోచనకు కంచె. నా మనవడు చదువుకుని వచ్చాడు అని సంబరపడుతున్న తాతకు రేపు ప్రొద్దున్న నాకు క్షవరం చేయమని ఆదేశించిన ఒక ధనికుడి సంకుచితత్వపు ధోరణికి అడ్డుకట్ట వేసుకోమని విస్మరించిన మానవత్వపు పునాదులను తవ్విన కంచె !!! 

కథ లో నాయకుడు  దూపాటి హరిబాబు  అనే ఒక సామాన్యుడు.... స్వచ్ఛమైన నీటివంటి వాడు. అందరిలో మంచిని చూడగలిగే వాడు. పరదేశీ యువతిలో కూడా తల్లిని దర్శించే మహోన్నతుడు. అన్నిటినీ మించి నమ్మిన నీతికి ప్రాణాలనైనా లెక్కచేయనివాడు. సినిమాలో నచ్చిన విషయాలు... కులమనే విషయాన్ని సరళంగా చెప్పిన తీరు అమోఘం.. ముఖ్యంగా సాయిమాధవ్ గారి సంభాషణలు, ఛలోక్తులు అద్భుతం... సంగీతం సందర్భానికి నేపథ్యానికి తగ్గట్టుగా అతికాయి... కళ, కెమేరా విభాగాల పనితనం అతి రమణీయం. 24 విభాగాల వారూ ప్రాణం పెట్టి పని చేశారు.

ఇక మాట్లాడవలసిన అసలు వ్యక్తి... రాధాకృష్ణ గారు... కుల వివక్షత మీద మీరు విసిరిన కొరడా అనిపించింది. అవసరాల జర్మన్ యువతిని అడ్డగించడం నుండి తల్లీ అని సంబోధించేంత వరకూ నడిచిన దృశ్యం అద్భుతం... ఊరిలో కంచెలకూ, దేశాల మధ్య వైరానికీ తేడాలేదని చెప్పిన అంశం.. రేపటి తరాన్ని కులరహిత సమాజం వైపుగా, విద్వేషాలకు దూరంగా నడపాలన్న ఆలోచనను hope అనే పాప జీవితాన్ని చూపిస్తూ రాబోయే ముప్పుని కూడా చూపడం వర్ణణాతీతం అనిపించింది. యుద్ధ సన్నివేశాలు ... నాకు చాలా ఇష్టమైన దర్శకులు Martin Scorsese గారి Pianist చిత్రాన్ని గుర్తుకు తెచ్చుకునేలా చేశాయి.... హరిబాబు సీత ప్రేమ సన్నివేశాలు రామాయణంలో స్వయంవరం గుర్తుకువస్తే పెళ్ళి రుక్మిణీ కళ్యాణాన్ని స్ఫురణకు తెచ్చింది... ముఖ్యంగా ముగించే ముందు మూడు విషయాలు... 1. భార్య గుర్తువచ్చినప్పుడు హరి ఉత్తరం రాస్తూ కథను ప్రేక్షకుడికి  చెప్పిన తీరు ... 2. చివరిలో తన బావ salute చేసి స్నేహితుడు అనడం.. 3. కంచె పీకమని అమ్మమ్మ తో చెప్పించడం !!!

I would like to conclude by coining Director Krish as "Scorcese of the South" !! 

Thursday, January 12, 2017

దశాబ్దపు గురువు... MANI RATNAM's గురుకాంత్ దేశాయ్



మణి రత్నం ... ఈయన సినిమా వస్తోంది అంటే అందరి ఆలోచనా  ఒక్కటే..  ఏదో కొత్త విషయం నేర్చుకునే ఆవకాశం వస్తోంది అని. అదే ఆయన ఒక వ్యక్తి మీద చిత్రం తీయబోతున్నాడని టీవీలు గోల చేస్తుంటే ఆయన చిన్న చిరునవ్వుతో కాదని తల అడ్డంగా ఊపేశారు. కానీ ఆయనకు తెలియదు సిరివెన్నెలగారి  పాట  విన్న శ్రీనివాసుడిలా ఇంకొకడు ఆయన చూపే చిత్రాన్ని చూసి స్ఫూర్తి చెందుతాడని.  దీన్ని చూసిన చాలా మందికి అర్ధమయ్యే విషయం ... ఇది  రిలయన్స్ అధినేత ధీరుభాయి అంబానీ చరిత్ర ను ఆధారం చేసుకుని తీసిన చిత్రం అని. చరిత్రలు, పూర్వాపరాలు గురించి వదిలేసి మనకిష్టమయిన సినిమా లోకి దూకేద్దాం.

లైట్స్ ఆపగానే అమితాబ్ లాంటి ఇంకో గంభీరమైన గొంతుతో కథ మొదలవుతుంది . ఆ గొంతు  ఆయన అబ్బాయి అభిషేక్ బచ్చన్ ది.  "సప్నే మత్ దేఖో ..సప్నే కభీ సచ్ నహీ హోతే.. మేరే బాపూ కెహతా థా, లేకిన్ మైనే ఏక్ సప్నా దేఖా" అనే మాటలతో మోదలవుతూనే.. గుజరాత్ లోని ఇధార్ గ్రామంలోని అతని బాల్యం లోకి దూకేస్తుంది.. వ్యాపారం చేయడానికి దేశం వదిలి వెళతానని ఒక పదమూడేళ్ల పిల్లాడు .. చదువు సరిగ్గా వెలగబెట్టు అని తండ్రి తిట్టే తిట్లు ... అటు నుండి ఇస్తాన్బుల్ .. మళ్ళీ గుజరాత్ .. సుజాత అనే అమ్మాయి కన్న కలలు... అటు నుండి రైలు లో గురు సుజాతల  పరిచయం.. స్నేహితుడిని వ్యాపారం అంటూ ఒప్పించి వాళ్ళ అక్కను పెళ్లి చేసుకుంటానని వెళ్లడం.. కాబోయే మామ ఊరి వారి సంకుచితత్వాలు గురించి చెప్పడం .. అన్నిటిని కొట్టి పారేసి పెళ్లి చేసుకుని బొంబాయి కి మకాం మార్చడం... అసోసియేషన్  సభ్యత్వం గురించి 'స్వతంత్ర  సమాచార్' దినపత్రిక అధిపతి మాణిక్ దాస్ గుప్తా ను కలవడం , వ్యాపారంలో వృద్ధి, భార్యాభర్తల మధ్యన తగువు.. గురుకాంత్ గురుభాయ్ గా ఎదగడం ... మాణిక్ దాస్ గురు కు ప్రత్యర్థి గా మారి  శ్యామ్ సక్సేనా అనే వ్యక్తిని గురుభాయ్ రహస్యాలను బట్ట బయలు చేయమని ఆజ్ఞాపించడం వరకూ చకచకా కన్నార్పనివ్వకుండా, రెప్పపాటులో  జరిగిపోతాయి. విశ్రాంతి సమయానికి  అద్భుతమైన మాట తో ముగిస్తారు మణిరత్నం .... "శ్యామ్ భాయ్! గురుభాయ్ సే లడ్నా, తో గురుభాయ్ బన్కే లడ్నా"  అని ... అక్కడి నుండి పోలిస్టర్ ఫ్యాక్టరీ నుండి పెట్రో కెమికల్ ఫ్యాక్టరీను కట్టేదాకా ఆయన అనుభవించిన వ్యయప్రయాసల గురించి, దొంగ దోపిడీ అనే వార్తల నుండి షేర్ మార్కెట్ లబ్ధిదారుల దాకా, సుజాత గారు "50 పర్సెంట్ పార్ట్నర్ హై సాబ్" అని అందించే స్ఫూర్తి నుండి .. "తుమ్హారే పేట్ మే సారే పచ్చిస్ హజార్ లోగ్ హై " అని విసిరే ఛలోక్తుల దాకా అన్నీ అద్భుతంగా కుదిరాయి.

ఇక సినిమా లోని తారాగణం గురించి చెప్పుకోవాలి .. మణి రత్నం గారి సినిమాకు వన్నె తెచ్చేదే ఆయన ఎంచుకునే నటీనటులు.. ముఖ్యంగా గురుకాంత్ దేశాయ్ గా జనాల ముందుకు వచ్చిన అభిషేక్ బచ్చన్. అవ్వడానికి అమితాబ్ గారి వారసుడైనా అప్పటి దాకా అతని మీద ఒక చిత్రాన్ని పూర్తిగా వదలవచ్చు అనే నమ్మకం ఎవరికీ కలిగి ఉండకపోవచ్చు.  కానీ పతాక సన్నివేశాలలో అతని నటన చుస్తే నటన "కమల్ హాసన్" నాయగన్ ను తలపిస్తుంది.  తరువాత సుజాతగా అలరించిన ఐశ్వర్యా రాయ్, వీరిద్దరి జోడి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. తేరే బినా పాట లోని నాట్యం, బర్సో రే మేఘా లో సుజాత గారి స్వతంత్ర భావాలు చూడదగ్గవి. వీళ్ళ మధ్యలో ఇంకొక జంట శ్యామ్ పాత్ర వేసిన మాధవన్, తన భార్యగా విద్యా బాలన్. మాణిక్ దాస్ గా మిథున్ నుండి ఐఏఎస్ అధికారి గా నటించిన ప్రతాప్ పోతన్ వరకు అందరూ పాత్రలకు గౌరవం హుందాతనం తీసుకువచ్చారు. 

ఇంక టెక్నికల్ విషయాలకు వస్తే గుల్జార్ కాలానికి రెహ్మాన్ సంగీతం.  రెహ్మాన్ గారి బాణీలు  అప్పటికీ ఇప్పటికి కూడా శ్రావ్యంగా ఉంటాయి, దానికి ఉదాహరణ సుజాత పాడే బరసో రే మేఘా అనే పాట. ఈ పాట పుట్టక మునుపు అందరి నోటివెంబట మేరే ఖాబో అని పాడే అమ్మాయిలు, ఇక్కడ నుండి ఈ పాటను  వదలలేదు. సమీర్ చందా గారి కళకు రాజీవ్ మీనన్ గారి కెమెరా పనితనం కళ్ళకు పండుగలాగా ఉంది .నవీ ముంబాయి నుండి తమిళ నాడు, ఆంధ్రలో తీసిన దృశ్యాల వరకు మల్లికా షెరావత్ నర్తించిన పాట నుండి ఏక్ లో ఏక్ ముప్త్ పాట వరకు ప్రతీ సెకను మనల్ని నోర్లు వెళ్ళబెట్టేలాగా చేస్తుంది. 

ఆకాశంలో చుక్కలెన్ని ఉన్నా చందమామ మాత్రం దర్శకుడు మణిరత్నం అనాలి . నిరుడు తరం కథ ఎంచుకోడమే కాదు మనల్ని ఆ కాలంలోకి టైం ట్రావెల్ చేయించే ప్రయత్నం చేశారు, ప్రతీ ఫ్రేము నుండి మనల్ని 1950లలోకి తీసుకువెళ్లారు. ముఖ్యంగా టైటిల్ కార్డులో అక్షరాలను టైపురైటర్ కొడుతున్నట్టు వెయ్యడం నుండి సినిమా ఆద్యంతం ఒక రస్టిక్ బ్రౌన్ కలర్ లో చూపించడం. ఇలాంటి ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు ఈ సినిమా నుండి. 

అలాంటి సినిమా కి ఇవాళ పదేళ్ళు నిండాయి అని చెప్పుకోడానికి గర్వపడుతున్నాను. మణిరత్నం గారు రాబోయే "కాట్రు వెళియిడై"తో మంచి విజయం సాధించి అలానే ఇంకొన్ని విషయాలను నేర్పుతారని ఆసిస్తూ ....