Thursday, December 24, 2015

తొలి అడుగు


December 01, 2015
Hyderabad

పాపిని నేను... అయినా ఇలా శిక్షించాలా??
ద్రోహిని నేను... నా త్రోవను మరల్చనే లేవా??
నీ ఎదపై తప్పటడుగులు వేసి... నీ గుండెలను తన్నిన నీచుడిని!
నిన్ను అణగతొక్కి అందలమును అంటాలనుకున్న వెర్రివాడిని!!
నా పాపమును వేరొక రీతిన క్షాళణము చేయ మార్గము తోచలేదా??
ఆకలికి అలమటిస్తూ నలువైపుల నీ కన్నీటి ప్రవాహాన కొట్టుకుపోతున్నాను...
నీ కంటి మంటను తాళలేక అల్లాడుతున్నాను.. శాంతించి సేద తీర్చవా?? నన్ను దగ్గరకు చేర్చుకుని ఊరడించవా??
ఓడిపోయానమ్మా... ఓడిపోయాను!
నీ ముందు నిలబడే శక్తిలేక నీరసించి పోయాను!!
చాలు ఈ తాపత్రయం!
చాలు ఈ జలదిగ్బంధనం!!
మారిన మనిషిని అని బిగ్గరగా అరిచి చెప్పలేని వాడిని!
నీ జలధారలో కలసిన
నా కన్నీటినే మార్పు కోసం
నేను వేసిన తొలి అడుగుగా భావించు!!

‪#‎PrayforChennai

Saturday, March 28, 2015

పల్లె రామాయణం

కొండ మీది దేముడంట జనులలోకి వచ్చెనంట
జగమెరిగిన వంశమంట అంకురమై వెలిసెనంట
సేవకులు ముగ్గురంట సోదరులుగ మారిరంట
ఒంటిరంగు వేరైనా నోటిమాట ఒక్కటంట

అడవిలోని సామికడకు విద్దె నేర్వబోయిరంట
విద్దెలన్ని నేర్చినంక అయ్యకడకు చేరిరంట
దేశానికి రాజైనా బిడ్డనొదిలి ఉండడంట
పెద్దపేగుని చూసి తనివితీర మురిసెనంట

మురిపెం తీరేలోగా సామి  ఒకరు వచ్చెనంట
ముక్కు మీద కోపమంట వొంటి నిండా అగ్గి అంట
అగ్గి మీద గుగ్గిలమై యేలికతో పలికెనంట
జగముకొరకు యాగమంట కావలులకు కొదవ అంట
కోరపళ్ళ రక్కసులు యాగమును చెరిచిరంట
వారినుండి కావలంట పెద్దపేగు బాధ్యంట
మాట విన్న యేలికకు నోట మాట రాలేదంట
నచ్చచెప్పి బుజ్జగించి పెద్దపేగుతో సాగెనంట
పెద్దపేగు సేవకొరకు చిన్నపేగు కూడెవెంట

మాయదారి అడవిబాట మాయలమారి పయనమంట
ఆడరక్కసొక్కటంట దారికడ్డమయ్యెనంట
పెద్దపేగు ముందు ఓడి ప్రాణాలు విడిచెనంట
యాగము చెడగొట్టేది ఈ రక్కసి బిడ్డలంట
అంబు ఒంటికంటగానే అమ్మనొకడు చేరెనంట
అగ్గిసామి కళ్ళలోన ఆనందపు జల్లులంట
పాదాల స్పర్శతగిలి ముళ్ళు పువ్వులాయెనంట
ఎంత పెద్ద విచిత్రమో రాయి పడుచు అయ్యెనంట
గున గున నడుచుచు వచ్చి ఇంటికి రమ్మని పిలిచెనంట
నది పక్కన నిద్దురంట తన చరితను తలిచెనంట
కాలి నడకన సాగుతూ చిలుక జాడ ఎరిగెనంట
పాతకాలపు విల్లంట... మొయ్యలేని బరువంట
దాని అంతుచూసినోడు చిలుకకు జతగాడంట
గోరువంక రాకనెరిగి చిలుకకు సంబరమంట
తన జత వాడేనని ధైర్యంగా ఉండెనంట
పదితలల పాము ఒకటి లోనికి జొరబడెనంట
చిలుకమ్మ ను ఎత్తుకెళ్ళ ప్రయత్నము చేసెనంట
చావు తప్పి జీవమొచ్చి వడిగా పరుగెత్తెనంట
గోరువంక తీరుగింక చిలుక జతను కట్టెనంట
అమ్మ చేతి ముత్యమంట అయ్య చేతి నీలమంట
నీలిముత్యాల తలంబ్రాలతో కళ్యాణం జరిగెనంట

గూటికి చేరిన జంటకు రాజ్యాన్ని కట్టబెట్టి
యేలికను చేయాలని యేలికకు మనసయ్యెనంట
మూడో చిలుకకు దాసి చెవిలో చెడు నూరెనంట
యేలిక మీదనే అలిగి రెండు వరాలు కోరెనంట
అయ్యను చూడగ వచ్చి గోరింకకు ఇది తెలిసెనంట
నగలు అన్నీ వొలిచీ నారచీర కట్టెనంట
చిలుకను చినపేగును కూడి అడవిలో అడుగేసెనంట

పెద్దపేగును ఒదులుకొని బాధపడిన యేలిక
చేసిన పాపఫలమని తల్లడిల్లిన వారిని మరువక
మనోవ్యధతో మంచమెక్కి మరణించేను తానిక
వార్త విన్న గోరింక.. కన్నీరు కార్చెనంట
వేదఘోష సహితంగా పితృకర్మ చేసెనంట
గడువు ముగిసేంత వరకూ రాజ్యాన్ని చేరనని
తమ్ముడికి పాదుకలిచ్చి రాజ్యానికి పంపెనంట

దారిలోన ఏరంట గుహుడు అనే భక్తుడంట
ఏరు దాటించడానికి కాళ్ళు కడగనివ్వమనెనంట
అడవి మధ్య పాకలోన చిలుకా గోరింకల నివాసము
చిలుకకు గోరింకకు చిన్నపేగు కావలితనము
గోరింకను కోరిన ముచ్చుకు చిన్నపేగుతో శృంగభంగము
పది తలల పాముకు ముచ్చు పోయి చెప్పటము
మారీచుడు మాయలేడి వేషాన్ని వేసె
చిలుకమ్మ చెలిమిచేయ ఆశగా చూసె
గోరొంక తమ్ముని తో లేడి కొరకు వెళ్ళగా
అదను చూసిన పాము కుబుసాన్ని విడిచె

చిలుకజాడ కనరాని గోరింక రోసే
పాముకు ఎదురెళ్ళి పక్షిరాజు కూలే
సూర్యునికి మొక్కుతున్న తోకరాయుడు చేతిలో
చిలుకమ్మ వదలిన ఆనవాలు చేరె

చిలుకకోసం వెదకుతున్న గోరువంక బాటలో
తనకోసం ఎదురుచూచు భక్తురాలు తారసిల్లె
వొణుకుతున్న మేనిని కనపడని చూపును లెక్కచేయక
ప్రేమగా పండ్లేరి నోటికందించే
కపివీరుని జాడ తెలిపి సాగనంపె
సేవను మెచ్చిన రేడు మనస్సు శాంతించి
నదీమతల్లిగా మార్చి ఋష్యమూకముకు వెడలె

కొండమీది వీరుడు వచ్చు వారిని చూచి
ఎవ్వారు వీరు అని మంత్రిని దూతగ పంపె
వచ్చిన వాడిని బంటుగా ఎరిగి
హనుమా అని పిలిచిన రేడు కౌగిట బంధించె
కపివీరుని స్థితి చూచి కదలిన పెదపేగు
రాజుని చేస్తానని అగ్నిప్రతిజ్ఞను పూనె
ఇచ్చిన మాటను నిలిచి వీరుని అన్నను అణచి
రాజ్యాన్ని మైత్రికి కానుకగా ఒసగె

చిలుకమ్మ చిక్కెనని హుంకరించిన పాము
నీ రేడు ఏడని గేలి మాటలు పలికె
ఆ రేడు రాడని నన్నేలుకొమ్మని
విషసర్పముల మధ్య చిత్రవధ చేసె
ఆనవాలను తోడి దిశ నిర్ణయించి
ఎలుగు కోతుల కూడి తోకరాయుడు కదలె
దరి మధ్యమ్మున సముద్రం కానగా
విశ్వరూపం దాల్చి కడలిపై తేలే

సర్పములు సయనించి గురకతీసే వేళలో
తోకరయుడు చేరి వెదకనారంభించె
శోకమున స్వామిని స్మరించు తల్లిని చూచి
చెట్టు మీదనుండి ఏడ్వనారంభించె
అలికిడికి మెలకువై అమ్మ పైకి చూడగా
ఆనవాలను ఒసగి తనను కుదుటపరచె

సంతసమున పండ్లతో విందు చేయుచుండగా
భటుల చేతికి చిక్కి సరసామాడగ జూచె
వార్తవిన్న పాము సభలోన తోకకాల్చ
లంకను మొత్తం కాల్చి నిప్పు చల్లార్చె
అమ్మ ఆనవాలును గ్రహించి తిరుగు పయనమవ్వుతూ
పాముకు హితవు పలికి స్వామి పదములు చేరె
ఆనవాలను చూచి ఆనందముప్పొంగి స్వామి
సంబరపడగా సంతసించెను

యుద్ధభేరి మ్రోగి సముద్రమును దాటి
వానరసేనతో యుద్ధం జరుగు మునుపు
స్వామి తుదిమారు హితవు పలికించే

పట్టిన పంతముకు పాము ఒక సోదరుని కోల్పోయె
బుద్ది కలిగిన మరొకడు స్వామి పాదముపైవ్రాలె
స్వామి సోదరుడు రణమున మృచ్చిల్లగా
హనుమ ధ్యానమ్ముతో సంజీవినిని పొందె
సోదరుని పునః జీవితుడిగా చూసి స్వామి సంతసంబొందె
నర వానర సమూహం వలన తలలు విరిగిన పాము.. కోరలు ఊడి
శరణు శరణు శరణనుచూ శరణుఘోషతో కూలె!

అమ్మ అయ్యను కలసి అయోధ్యకు చేరగా
అయ్య పట్టాభిషేకుడై అమ్మతో కూడగా
ఇంకేమి కావాలి ఈ వానరమూకకు
జయకారములివే మా సంతసమునకు





శ్రీరామ! జయరామ! జయ జయ రామ!! 







Friday, March 20, 2015

ఆశ

కంటి నిండుగ నీరు నిండిన.. చూపుకు తావెక్కడిది ??
మది నిండుగ గతము నిండిన భవితకు చోటెక్కడిది ??
పీడ కలల భాష్పముల నడుమ చిక్కుకుంటి నేస్తమా....
అభయహస్తమిచ్చు చేయి ఇహమున తారసిల్లునా ....
రక్తములో ప్రతి అణువూ వెక్కిరించుచున్నదే
నాడులలో జీవముడిగి కంపింప చేయుచున్నది
నిసిరేయి కాంతి లోన చెకోరమును నేనా??
ఏ చక్రవాకమైనా  నా అగ్నిని చల్లార్చునా??