Sunday, October 28, 2012

నలుగుతున్న ప్రశ్నకు నవభాష్యం

కంటిలోన కదలు ప్రతి ఒక్క బాష్పమునకు
భాష్యము చెప్పు రోజు రాబోవునది ముందు !!

గుండెలోని కడలి బరువెక్కకమునుపే
నరములోని ఊహ చల్లారకమునుపే
చుట్టుకున్న చీకటి మింగేయకమునుపే
నీ అంతరాత్మ నిను చూసి ఈసడించక మునుపే ....

అడవిని సైతం దహించు  దావాగ్ని వోలె
బిరబిర చర చర వేగిరమే కదలి  రా ...
ఎగసి పడిలేచే సముద్రపు అలల వోలె
నీ ప్రశ్నకు బదులు వెతక నీవే కదలి రా...

నీ అన్వేషణ ను బట్టి
నీ దశ ఇక రాసున్నది
బాటలోన నీతి చేరి
అది ఒక దిశ కానున్నది !

ఒంటరివని అలసిపోకు 
నిస్పృహతో విసిగిపోకు
జగమునకు  వెలుగురేడు
నభమున ఒంటరికదా !

నీకున్న భుజశక్తి ..
నీలోని ధీయుక్తి
ఏకమైనను చాలు....
సేనలూరును వేలు !!!

పోరు నువ్వై... సేన నువ్వై....
కీడునణచే త్రాణ నువ్వై...
పోరు సలుపు .... తీరు నిలుపు....
పొతే పోయేది  ఉసురే కదా !!!!!

నిన్ను నమ్మిన జనులు నీ దరి 
చేరి కూర్చుని  తెలుసుకునేరు
నీ బాట సుగమమని .....
నీ మాట సత్యమని ...
నీ తలపు  స్వచ్చమని...
నీ పోరు జనులకని....!!!

నవజాతికి నీ వాక్కు.... అమృతమగు నవ దిక్కు !

 "  నీకు తెలిసిన నిజమును తెలుపుటకు నేత వి కానక్కరలేదు మిత్రమా , నిజాయితీగల పౌరుడవయితే చాలు..!! " 


 





2 comments: