Tuesday, December 7, 2010

సాధన

అది అర్థరాత్రి... సమయం 12:30 కావొస్తోంది!
కారుచీకటిని కమ్ముకున్న గది.. ప్రతీ మనిషి కంటికీ నిశ్శబ్దమే ప్రస్ఫుటంగా కనపడుతోంది... మనసు పెట్టి పరికించి చూడగా, ఆ నిశిరేయిలో రెండు శబ్దాలు స్పష్టంగా వినబడుతాయి!! మొదటిది.. తిరగాలా? మానాలా? అనే సందిగ్ధావస్థలో తిరుగుతున్న ఫ్యాను. రెండవది, టపటపా మారుతూ వింతసబ్దాలు చేస్తున్న టి.వి!!! కాని నా ఆంతర్యానికి వీటిని దాటుకుని వినపడిన మరొక శబ్దం, అది శబ్దం కదు..రోదన, మనోవేదన.ఎవరో కాదు, టి.వి రిమోటు పట్టుకొని చాన్నెళ్ళని మారుస్తూ.. దీర్ఘంగా ఆలోచిస్తున్న ముప్ఫై ఏళ్ళ తెలుగింటి ఆడపడుచు...జయ. తనను వర్ణించాలంటే...నిశిరాత్రి వంటి నల్లని మేని ఛాయ, నుదుటున అస్తమిస్తున్న భానుడిలా చెరిగిన తిలకం, దట్టమైన అడివిని స్ఫురింపచేసే వొత్తైన జుట్టు. జయ లోని బాధను గురించి తెలియాలంటే, తన గతం మనకు తెలియాలి! తన ఆలోచనల సెగలను దాటి, కాలాన్ని వెనక్కు తిప్పిచూస్తే...

అది 1995వ సంవత్సరం..ప్రభుత్వ ప్రసూతి కేంద్రం!!
మూలన ఉన్న ఒక గదిలో జయ పడుకుని ఉంది.... తెల్లవారుఝామున ఆసుపత్రి లోని వారందరూ జయ పెట్టిన కేకకు ఉలిక్కిపడి నిద్రలేచారు, ప్రసవవేదనకు విలవిలలాడిపోతోంది జయ, చుట్టు ఏ డాక్టరూ లేరు, నర్సులు తప్ప. కంగారు పడిన ఒక నర్సమ్మ డాక్టరుకు ఫోను కలిపింది, అలాగే జయను ఆపరేషను చేసె గదిలోకి మార్చింది. పావుగంట తరువాత ఒక 40 ఏళ్ళ ఆవిడ తెల్లకోటు వేసుకొని ఆపరేషను గదిలోకి నడిచింది. గంట తరువాత స్ప్రుహలోకి వచ్చిన జయకు నర్సు ఒక ఆడబిడ్డను చూపించి వేరే గదిలోనికి తీసుకువెళ్ళింది. కూతురిని చూసుకున్న ఆనందం తనకి ఎక్కువ సేపు ఉండలేదు. ఉదయాన తన భర్త సుధాకర్ కు ఫోనుచేసి విషయాన్ని చెవిన వేసింది నర్సమ్మ!! ఎండ నడినెత్తికి ఎక్కినంత వరకూ జయతో పాటు కూర్చుని ఎదురుచూసింది.. కానీ సుధాకర్ మాత్రం రాలేదు. మగబిడ్డను కనలేదన్న కోపం కూతుర్ని చూసుకున్నాక అయినా తగ్గుతుందేమో అని ఆశించిన జయకు నిరాశే ఎదురయ్యింది. ఆసుపత్రికి రాకుండానే సుధాకర్ కు ఏ బిడ్డ పుట్టబోతోందో తెలియడానికి కారణం ఐదవ నెలలోనే వచ్చిన స్కానింగ్ రిపోర్ట్. ఆడపిల్ల పుడితే ఖర్చెక్కువ అవుతుంది అనేది జనోవాచ. కానీ తన భర్త కూడా అందరి లాంటి మగవాడే అని తెలిసి ఒక అసహ్యించుకుంది. లోకానికి జడిసి తను కుటుంబాన్ని వదిలేసుకుంటే, కూతురికోసం తను భర్తను వదిలేయడం లో తప్పు లేదనుకొంది. ఈ ఆలోచనలకు అడ్డుకట్ట వేసే వార్త మరొకటి వినపడింది.

డాక్టరు జయను తన గదిలోనికి పిలిపించుకొని, కూర్చోబెట్టి తన వివరాలను విచారిస్తోంది. చెప్పడానికి కొంచం సతమవుతూనే అసలు విషయాన్ని నెమ్మదిగా చెప్పింది. " జయా! ఈ విషయాన్ని జీర్ణించుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు కానీ తప్పదు. నీ పాప ఎనిమిదవ నెలలో పుట్టడం వల్ల, తనకు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఇది చాల మంది విషయాల్లో జరిగినదే, కానీ మనకు వస్తే గానీ ఆ కష్టం ఒక నరకం అని గ్రహించలేము. అసలు విషయంలోకి వస్తే, పాప కాలిలోని నరాలకు స్పర్శ తెలియడం లేదు, తను నడవలేదు. అలాగని ఎప్పటికీ నడవలేదు అని నేను చెప్పను, కానీ అది జరిగితే అద్భుతం అనే అనాలి. తను జీవితాంతం చక్రాల కుర్చీలోనే కాలాన్ని గడపాల్సివస్తుంది." అని అంటూ బల్ల మీద ఉన్న జయ చేతిని పట్టుకుని ఓదారుస్తుంటే జయ కళ్ళలోనుండి అశ్రువులు డాక్టర్ చేతిమీద రాలాయి.

డాక్టరు గది నుండి బయటకు వచ్చిన జయకు ఎదురైన మొదటి సమస్య.. ఆధారం? పూట గడవడానికే మార్గం లేని తను, ఇప్పుడు బిడ్డ బాధ్యతను ఎలా మోయాలి? అయినా అడుగు ముందుకే కానీ వెనక్కు కాదు! ఆలోచిస్తూ గోళ్ళు కొరుకుతుండగా తన వేలు మెడలోని చైనుకి చిక్కుకుంది. కుటుంబమే లేకపోయాక మెడలో ఆ అలంకారం ఎందుకు అని మార్వాడి కొట్టులో అమ్మేసింది. కొద్ది రోజులకు ఆ డబ్బు సరిపోతుంది కానీ జీవితాంతం కాదు అనే ఆలోచనతో తన డిగ్రీ పట్టా ను పెట్టి, బ్యాంకులో ఋణం తీసుకుంది. అన్నింటిలో తనకు ఎదురు తిరిగిన కాలం తన వ్యాపారాన్ని ఏమీ చేయలేకపోయింది. రెండేళ్ళలో తన దశను మార్చుకుని, పాపను జీవితాంతం పోషించే ఆధారం ఏర్పరచుకుంది. 

గతంలో నుండి బయటకు వస్తే ఇప్పుడు జయకు తలెత్తిన సమస్య ఇది కాదు. ఆలోచనలు తారస్థాయికి చేరుకొనగా ఇవాళ తనను కృంగదీసిన విషయాన్ని తలచుకొంటూ మథన పడసాగింది.తన కూతురిని ఒక మంచి పాఠశాలలో చేర్చాలని వాకబు చేయగా, వైకల్యం ఉన్న పిల్లలని చేర్చుకోలేము అన్న సమాధానం ఒక్కటే వినబడింది. ఇదే మాట తనను దావాగ్నిలా కాల్చివేసింది. చదువుకు కావాల్సినది తెలివి కాదా? వైకల్యం ఉన్నవారు చదువుకోడానికి పనికిరారా? అందరూ సమానమే! మనమంతా ఒక్కటే అన్న సూక్తులు కేవలం నోటిమాటలేనా? అసలు వైకల్యం ఉన్నది పిల్లలో కాదు, వక్రబుద్ధి తో ఆలోచించే ఈ సమాజానిది! మేడిపండులాంటి వీరి మధ్యలోంచి నా కూతురిని దూరంగా తీసుకువెళ్ళాలి అని తీవ్రం గా ఆలోచిస్తోంది జయ. కానీ ఎలా? అనేది తన ఊహకు అంతుపట్టని సమస్య. అన్ని ఆలోచనల మధ్య కూడా రిమోటు చానెళ్ళను మారుస్తూనే ఉంది.

అమరజ్యోతి

నవ .మాసాలు మోసిన తల్లిని వదలినావు...
గుండెలపై ఎత్త్తుకుని పెంచిన తండ్రిని వదలినావు.
నీ సుఖాన్నే కాంక్షించిన అన్నాను విడనాడినావు...
జీవితాంతం తోడుగా ఉంటానని బాస చేసి...
ఈ మిత్రులను మరచినావు...



దారపు పోగును చేతికి చుట్టి ఎనలేని ఋణమును పెంచినావు..
చదువుతో నీ ప్రయాణం మొదలుపెట్టి..
అందులో దిత్తవన్న పేరును గడించినావు...
ప్రాపంచికంగా అందరికి దూరమైన నీఎవు మా హృదయాలలో
"అమరజ్యోతి" గా నిలచినావు...

నిన్ను ఎన్నటికి మరువలేము ఓ నేస్తం....
నీ జ్ఞ్యాపకాలు మా హృదయాలలో  ఎన్నటికీ  పదిలం